విశాఖ స్టీ‌ల్ ప్లాంట్‌కు నష్టాలొస్తున్నాయని చెప్పి కేంద్రం ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేస్తూండంగా ఆ సంస్థ నుంచి మరింత పిండుకోవడానికి గంగవరం పోర్టు కొత్త యాజమాన్యం ఒప్పందాలను సైతం ఉల్లంఘిస్తోంది. అదానీ పోర్ట్స్ సంస్థ  గంగవరం పోర్టును పూర్తి స్థాయిలో కొనుగోలు చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా తన వాటాను ఇచ్చేసింది. గతంలోనే ప్రైవేటు వ్యక్తల ఉన్న వాటాలను కొనేసి పూర్తిగా అధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు చార్జీలు పెంచేస్తోంది. పెంచిన చార్జీలు ఇవ్వకపోతే దిగుమతి అయిన సరుకును ఇవ్వబోమంటూ సొంత గోడౌన్లకు తరలించడం వివాదాస్పదం అవుతోంది.


Also Read : గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను అదానీకి అమ్మేసిన ఏపీ ప్రభుత్వం


గంగవరం పోర్టుకు వ్యాపారం అంతా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తమ ఉక్కు ఉత్పత్తుల కోసం అయిన ముడి సరుకును  విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో తయారైన ఉక్కును శుద్ధి చేయడానికి ఉపయోగించే లైమ్‌ స్టోన్‌, ఉక్కు తయారీకి అవసరమైన కోకింగ్‌ కోల్‌లను దుబాయ్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి నౌకల ద్వారా దిగుమతి చేసుకుంటుంది. అలాగే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల్ని గంగవరం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తూంటారు. పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఎగుమతి, దిగుమతుల ద్వారానే భారీ లాభాలు గంగపోరం పోర్టు ఆర్జిస్తోంది.


అయితే పెట్టిన పెట్టుబడి మొత్తం మళ్లీ స్టీల్ ప్లాంట్ ద్వారా పొందాలని అనుకుంటున్నారేమో కానీ అదానీ పోర్ట్స్ యాజమాన్యం చార్జీలను పెంచేసింది. దుబాయ్ నుంచి దిగుమతి అవుతున్న లైమ్ స్టోన్‌ను ప్రత్యేక మార్గం ద్వారా స్టీల్ ప్లాంట్ తరలించేందుకు ప్రస్తుతం చెల్లిస్తున్న దాని కంటే అదనంగా చెల్లించాలని పట్టుబడుతోంది. అదానీ డిమాండ్ చేస్తున్న ప్రకారం చెలిస్తే రూ. 21 కోట్లు స్టీల్ ప్లాంట్‌కు అదనపు వ్యయం అవుతుంది. నిజానికి గంగవరం పోర్టుతో స్టీల్ ప్లాంట్‌కు చార్జీల ఒప్పందం ఉంది. 2011లో జరిగిన ఈ ఒప్పందం 2026 వరకు అమలులో ఉంటుంది. అప్పటి వరకూ పోర్టు చార్జీలు పెంచకూడదు. కానీ కొత్త యాజమాన్యం చార్జీలు పెంచేసింది. కుదరదని స్టీల్ ప్లాంట్ అధికారులు చెప్పే సరికి దిగుమతి అయిన లైమ్ స్టోన్‌ను సొంత గోడౌన్లకు మళ్లించారు. దీంతో ఉత్పత్తికి ఇబ్బంది అవుతుందని పోర్టు యాజామాన్యం కొంత ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించింది. 
 


స్టీల్‌ప్లాంటు ఏడాదికి 18 లక్షల టన్నుల లైమ్‌స్టోన్‌ను దిగుమతి చేసుకుంటోంది. టన్నుకు రూ.120 చొప్పున ఎక్కువ చెల్లించాలని అదాని పోర్టు ఆదేశించడంతో ఏడాదికి రూ.21 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లైమ్ స్టోన్ దిగుమతులకే రేట్లు పెంచితే.. రేపు కోకింగ్ కోల్ దిగుమతికి కూడా అదే పని చేస్తారని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తోంది. పాత అప్పులు చాలా వరకు పేరుకుపోయినా ప్రస్తుతం మెరుగైన పనితీరు కనబరుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అదనపు భారం స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బందికరంగా మారుతుంది.