దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదవుతున్న తీరును పరిశీలిస్తే కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని చెప్పలేమని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ కేరళలో మాత్రం వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియాకు తెలిపారు.
సెకండ్ వేవ్ ఇంకా పోలేదు..
దేశంలో ఇప్పటికే థర్డ్ వేవ్ పై చాలా నివేదికలు వెలుగుచూడగా.. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం భిన్నంగా స్పందించింది. ఇంకా దేశంలో సెంకడ్ వేవ్ ముగిసిందని చెప్పలేమంది. ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాజేశ్ భూషణ్ సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అన్నారు.
వ్యాక్సినేషన్ జోరు..
వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 66 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది. 16 శాతం మంది అర్హులైన జనాభాకు రెండు డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 54 శాతం మందికి ఒక డోసు పూర్తయినట్లు తెలిపింది.
సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీలలో 100 శాతం మంది(18ఏళ్లు పైబడినవారు) కనీసం ఒక డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.