వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తాను ఒంటరి దాన్నయ్యాయని సంచలన ట్వీట్ చేశారు. తండ్రి తనకు ఎంత ఆప్యాయత పంచారో గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తన కంట కన్నీరు ఆగడం లేదని ఉద్వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.






వైఎస్ షర్మిల పెట్టిన ఈ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఎందుకు ఒంటరిగా ఫీలవుతున్నారు ? వైఎస్ కుటుంబం అంతా ఆమె వెనుక లేదా ? తండ్రిలా చూసుకోవాల్సిన అన్న కూడా పట్టించుకోవడం లేదా ? అంత పెద్ద నేత కుమార్తెకు ఎందుకీ కష్టం వచ్చింది ? ఇప్పుడు ఇవే రాజకీయ పార్టీల నేతలందరికీ వస్తున్న సందేహాలు. 


ఇడుపులపాయలో పలకరించుకోని జగన్, షర్మిల..!


వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబం అంతా నివాళులు అర్పించడానికి ఇడుపుల పాయకు వెళ్లారు. గతంలో జయంతి రోజు ఉదయం షర్మిల, సాయంత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న  ప్రచారం జరిగింది. ఈ సారి అలాంటి ప్రచారానికి చెక్ పెట్టడానికి కుటుంబం అంతా కలిసి వెళ్లి నివాళులు అర్పించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఒక రోజు ముందుగానే షర్మిల, వైఎస్ విజయలక్ష్మితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులకు చేరుకున్నారు. అందరూ ఒకే భవనంలో బస చేశారు కూడా. అలాగే అందరూ కలిసి వెళ్లి నివాళులు అర్పించారు. వైఎస్ విజయలక్ష్మితో పాటు జగన్, షర్మిల పక్క పక్కనే కూర్చుని తండ్రిని స్మరించుకున్నారు. దీంతో రాజకీయాలు ఎలా ఉన్నా కుటుంబం అంతా ఒకటేనని అనుకున్నారు.


ఒంటరి అయ్యానని షర్మిల అనుకోవడానికి అదేనా కారణం..! 


కానీ నివాళులు అర్పించడం ముగిసిన వెంటనే వైఎస్ షర్మిల తాను ఒంటరినని భావోద్వేగ ట్వీట్ పెట్టడంతో కలకలం ప్రారంభమయింది. అసలేం జరిగిందనే చర్చ కూడా ప్రారంభయింది. జగన్, షర్మిల ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని తండ్రిని స్మరించుకున్నారు కానీ వారు మాట్లాడుకోవడం ఎవరూ చడలేదు. ఒకరి ముఖాలు కూడా ఒకరు చూసుకోలేదు. మాట్లాడుకోలేదు. ముభావంగానే ఉన్ారు.  కేవలం కలిసి నివాళులు అర్పించడానికి వచ్చారు కానీ వారి మధ్య నిజంగానే మాటల్లేవన్న అభిప్రాయం ఈ ఘటన ద్వారా బలపడిందని అంటున్నారు.


వైఎస్ఆర్ ఎస్టేట్‌లో రాత్రి కుటుంబ సమావేశం జరిగిందా..? 


వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించేందుకు  షర్మిల, విజయలక్ష్మితో పాటు వైఎస్ జగన్ కూడా ఒకటో తేదీన పులివెందులకు వచ్చారు. వారంతా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్‌లోనే బస చేశారు. ఒకే భవనంలో కుటుంబం అంతా ఉన్నారు. వైఎస్ భారతి మాత్రం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కడప నుంచి పులివెందుల వచ్చిన తర్వాత ఇడుపుల పాయ ఎస్టేట్‌కు వెళ్లలేదు. మిగిలిన అందరూ వైఎస్ఆర్ ఎస్టేట్‌లోనే బస చేశారు. ఈ సందర్భంగా కుటుంబం విషయాలు, రాజకీయ అంశాలపై చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిలకు రాజకీయంగా సహకరించేందుకు సీఎం జగన్ అయిష్టత చూపి ఉంటారని అందుకే ఆమె ఒంటరి అనే భావనకు వచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.


షర్మిల పార్టీకి విజయమ్మ మద్దతు - జగన్ వ్యతిరేకత 


షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతకు ముందే బహిరంగంగా ప్రకటించారు.  అయితే ఆమెకు తల్లి విజయలక్ష్మి మద్దతిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలిద్దరూ రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని ప్రకటించారు. అదే విధంగా షర్మిల పార్టీ వైఎస్ఆర్ టీపీ కోసం కష్టపడుతున్నారు.  వర్థంతి రోజు హైదరాబాద్‌లో వైఎస్ ఆత్మీయులందర్నీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమావేశానికి వైసీపీ నేతలెవరూ వెళ్లవద్దని హైకమాండ్ ఆదేశిచింది. హాజరయ్యేందుకు జగన్ కూడా ఆసక్తి చూపించలేదు.  తండ్రి పేరుపై నిర్వహిస్తున్న సంస్మరణకు హాజరయ్యేందుకు సీఎం జగన్ నిరాకరించడంతో  షర్మిల తాను ఒంటరి అయ్యానని మరింత బలంగా అనుకుంటున్నారని భావిస్తున్నారు.


రాజకీయంగా వెళ్తున్నారని సోదరిని వ్యక్తిగతంగా జగన్ దూరం పెడుతున్నారా..? 


వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం ఆయన కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చాలు ఉండేవి కావు. చాలా పెద్ద కుటుంబం అయినప్పటికీ వైఎస్ మాట అంటే అందరికీ వేదవాక్కులా ఉండేది. అయితే ఆయన మరణం తర్వాత కుటుంబం మొత్తాన్ని ఏకతాటిపైకి ఉంచడంతో  జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నారన్న అభిప్రాయం పులివెందులతో పాటు వారి కుటుంబంలోనూ వినిపిస్తోంది. కొంత మందిని ప్రోత్సహించడం.. మరికొంద మందిని దూరం పెట్టడం వంటి చర్యల ద్వారా సొంత వారిని జగన్ దూరం చేసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయ పరంగా విభేదాలు రాని కుటుంబాలు ఉండవని చెప్పుకోవచ్చు. కానీ అంత మాత్రాన వ్యక్తిగత సంబంధాలు ఎవరూ తెంచుకోరు. కానీ దీనికి భిన్నంగా షర్మిల రాజకీయ పార్టీ పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా చెల్లిని దూరం పెడుతున్నారన్న అభిప్రాయం ప్రస్తుత పరిణామాల వల్ల ఏర్పడుతోంది.