Supreme Court Judgments 2024: సుప్రీంకోర్టు 2024లో వెయ్యికిపైగా తీర్పులను వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పు అంటే శిలాశాసనం. ఈ ఏడాది సుప్రీంకోర్టు ఎన్నో సంచలన తీర్పులను వెల్లడించింది. అందులో మొదటిది బిల్కిన్ బానో నిందితుల బెయిల్ రద్దు చేయడం. 


1. బిల్కిస్ బానో నిందితుల బెయిల్ రద్దు 


గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును ఈ ఏడాదే ఇచ్చింది. ఆ ఘటన దోషులను విడుదల చేస్తూ గతంలో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులుగా శిక్షకు గురైన వారిని విడుదల చేశారు. వారిని సుప్రీంకోర్టు మళ్లీ జైలుకు పంపింది.


2.ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌పై కీలక తీర్పు


ఎలక్టోరల్‌ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు కొట్టివేసింది.  రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, సమాచార హక్కు చట్టానికి ఎలక్టోరల్‌ బాండ్లు వ్యతిరేకమని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ చంద్రచూడ్‌ సారథ్యంలో జస్టి్‌సలు సంజీవ్‌ ఖన్నా, బీఆర్‌ గవాయ్‌, జేబీ పార్ధీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. 232 పేజీలతో కూడిన రెండు వేర్వేరు తీర్పులను ధర్మాసనం వెలువరించింది. అయితే, ఇవి రెండూ ఏకాభిప్రాయంతో ఉన్నవే.  రాజకీయపార్టీలకు ఎన్ని నిధులు లభిస్తున్నాయన్న సమాచారం ఓటర్లకు తెలియాల్సిన అవసరం ఉంది. ఓటరు తన ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవటానికి ఇది అవసరం అని సుప్రీంకోర్టు ప్రకటించింది. 


3. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేజ్రీవాల్‌కు బెయిల్ 


ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన మరో కీలక తీర్పు కేజ్రీవాల్‌కు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 11 నుంచి జైలులో ఉన్నారు. తన బెయిల్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 13, శుక్రవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.  సీబీఐ పై సమాజంలో ఉన్న ‘పంజరంలో ఉన్న చిలుక’ అన్న అభిప్రాయాన్ని తొలగించుకునేలా వ్యవహరించాలని  సుప్రీంకోర్టు సీబీఐకి సూచించింది. ‘సీబీఐ అనేది మచ్చలేని చిలుక అని చూపించాలని స్పష్టం చేసింది. 


4. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు


ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన బెంచ్ మార్క్ తీర్పుల్లో ఒకటి ఎస్సీవర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు. ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా, ఒకరు వ్యతిరేకించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పుచెప్పడం ద్వారా ఎస్సీ కోటాలో ఉప వర్గీకరణ ఉండదని 2004లో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది.


5. బుల్ డోజర్ న్యాయంపై కీలక తీర్పు 


సుప్రీంకోర్టు ఇచ్చిన టాప్ ఫైవ్ తీర్పుల్లో ఒకటి బుల్డోజర్ న్యాయంపై ఇచ్చినది. యూపీ సహా పలు ప్రాంతాల్లో బుల్డోజర్ల కూల్చివేతల విషయంలో దాఖలైన పిటిషన్లపై  సంచలన తీర్పును వెల్లడించింది. కేవలం ఆరోపణలతో ఏకపక్షంగా పౌరుల ఇళ్లు కూల్చివేయడం రాజ్యాంగ చట్టాన్ని, అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని వివరించింది. కార్యనిర్వాహక వర్గం, అధికారులు చట్టవిరుద్ధంగా ఆస్తులను నిర్ధారించి కూల్చివేయడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పింది. నిందితులపై ఎలాంటి చర్యకైనా ముందు న్యాయమైన విచారణ జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారులు ఆస్తులను లీగల్, ఇల్లీగల్ అని నిర్ధారించడం తగదని సుప్రీం కోర్టు  తీర్పు చెప్పింది.