Viral News: కవలు చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో కవలు చేపల కూరలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. చేపల పులుసు, చేపల ఇగురు, ఫ్రై ఇలా తలచుకుంటేనే నోరు ఊరుతుంది. కొందరిలో మాత్రం చేపలు తింటే ముళ్లులు గుచ్చుకుంటాయనే భయం ఉంటుంది. అయినా నెల్లూరు చేపల పులుసైనా, గోదావరి పులసైనా నాలుకకు తగిలేతే ఆహా అనాల్సిందే. చేపల కూరను ఒక రోజు తరువాత తింటే దాని రుచి తెలుస్తుందని అంటారు పెద్దలు.


అయితే ఫ్రాన్స్‌లో ఇలా నిల్వ చేసిన చేపల కూర తిని అరుదైన వ్యాధితో మహిళ మరణించింది. ఫ్రాన్స్ లోని బోర్డియక్స్‌ సిటీ వైన్, ఆహారానికి ప్రసిద్ధి చెందింది. పట్టణంలో సాధారణంగానే పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఉంటారు. ఇక్కడ చిన్ ట్చిన్ వైన్ బార్ అనే రెస్టారెంట్‌లో సెప్టెంబరు 4 నుంచి10 తేదీల మధ్య పలువురు సార్డినెస్‌ అనే చేపల వంటకాన్ని తిన్నారు. వారిలో 32 ఏళ్ల ఓ మహిళ మరణించింది. మరో 12 మంది పరిస్థితికి విషమించడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. 


మృతురాలి జాతీయతను ఇంకా నిర్ధారించలేదని అధికారులు తెలిపారు. బోర్డియక్స్‌లోని రెస్టారెంట్లో సార్డినెస్‌ను తినడం వల్లే మరణం సంభవించినట్లు DGS హెల్త్ అథారిటీ మంగళవారం ఆలస్యంగా తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మరో 12 మంది అత్యవసర చికిత్స పొందుతున్నారని బోర్డియక్స్‌లోని పెల్లెగ్రిన్ ఆసుపత్రి వైద్యుడు బెంజమిన్ క్లౌజౌ తెలిపారు. వారిలో ఐదుగురు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. బాధితుల్లో అమెరికన్, ఐరిష్, కెనడియన్ జాతీయులు ఉన్నారని ఆయన చెప్పారు. జర్మన్‌ పౌరుడు చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాడని డాక్టర్ తెలిపారు


బాధితులంతా బోర్డియక్స్‌లోని చిన్ ట్చిన్ వైన్ బార్ రెస్టారెంట్‌లో సెప్టెంబరు 4  నుంచి 10 మధ్య సార్డినెస్‌ తిన్నారు. అయితే నిల్వ ఉంచిన ఆహారంలో క్లోస్ట్రిడియం బోటులినమ్ బ్యాక్టీరియా పెరగడంతో విషపూరితంగా మారిందని, ఆహారాన్ని సరిగా శుభ్రం చేయకపోవడం, క్రిమిరహితం చేయనప్పుడు ఇలా జరుగుతుందని  DGS తెలిపింది. రెస్టారెంట్‌లో అధికారులు ఇంకా పరీక్షలు నిర్వహిస్తున్నారని, చాలా రోజుల వరకు నిల్వ ఉన్న కారణంగా ఆహారం విషం పూరితంగా ఉండొచ్చని పేర్కొంది.


దీని ప్రభావం కండరాల మీద ఉంటుందని, చాలా వారాల పాటు ప్రభావం చూపుతూ కండరాల పక్షవాతానికి కారణమవుతుందని వైద్యులు తెలిపారు. శ్వాస కోశ కండరాలపై ప్రభావం చూపితే అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. స్థానిక వార్తాపత్రిక ఘటనపై కథనాలను ప్రచురించింది. రెస్టారెంట్ యజమానిని ఉటంకిస్తూ.. సార్డినెస్ ఉన్న జాడీలను తెరిచినప్పుడు వాటి నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చిందని, వాటిని యజమాని పారవేశాడని పేర్కొంది. బాగున్న వాటిని వినియోగదారులకు అందించినట్లు తెలిపింది.