Libya Flood:
డేనియల్ తుపాను లిబియాలో విలయం సృష్టించింది. తుపాను కారణంగా రెండు డ్యామ్లు బద్దలయ్యాయి. దీంతో భారీగా వరదలు సంభవించాయి. ఇప్పటి వరకు 5,300 మంది మరణించగా.. మరో 10 వేల మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా డెర్నా పట్టణం ఈ వరదలకు ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలే కనిపిస్తున్నాయి. వాహనాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. సహాయక సిబ్బంది ఇప్పటి వరకూ 2వేలకు పైగా మృతదేహాలను వెలికితీశారు. 1,000 మృతదేహాలను గుర్తించి అంత్యక్రియలు నిర్వహించారు. జలప్రళయం ధాటికి 20వ శతాబ్దం మొదట్లో నిర్మించిన భవనాలు ధ్వంసం అయ్యాయి.
వరదల తాకిడికి రెండు డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యాములు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత పోటెత్తిన వరద నీటిలో అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. డెర్నా నగరంలోనే ఎక్కువ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. సముద్ర తీరంలోని పర్వత ప్రాంతంలో డెర్నా నగరం ఉంది. ఇక్కడ నివాస గృహాలు చాలా వరకు పర్వత లోయలో ఉన్నాయి. ఈ కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. డ్యామ్ బద్దలు కావడంతో ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక్కసారిగా భారీగా బురద నీరు చొచ్చుకొచ్చింది. ప్రజలు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. రోడ్లపై ఎటు చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గుట్టలుగుట్టలుగా కొట్టుకొస్తున్నాయి.
వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని లిబియా ఎమర్జెన్సీ అండ్ అంబులెన్స్ అథారిటీ ప్రకటించింది. సముద్ర మట్టం, వరద, గాలి వేగం వంటివి సరిగ్గా అధ్యయనం చేయలేదని, ఈ స్థాయి ముప్పును లిబియా గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని అధికారులు తెలిపారు. తూర్పు తీరంలోని అల్ బైడ, అల్ మర్జ్, తుబ్రోక్, టాకెనిస్, బెంగ్‌హజి నగరాలు కూడా వరదలకు ప్రభావితం అయ్యాయి. అత్యంత ఘోర వినాశనాన్ని చూసిన డెర్నా నగరంలో దాదాపు 6,000 మంది తప్పిపోయారని లిబియా తూర్పు ప్రభుత్వ ఆరోగ్య మంత్రి ఒత్మాన్ అబ్దుల్‌జలీల్ వెల్లడించారు.