Rishi Sunak Parents Visit Mantralayam Temple:
బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునక్‌ తల్లిదండ్రులు యష్‌వీర్‌ సునక్‌, ఉషా సునక్‌లు బుధవారం రోజు ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయం ఆలయాన్ని సందర్శించారు. వీరితో పాటు సుధా మూర్తి కూడా ఉన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆలయాన్ని దర్శించుకున్న వారు అక్కడ పూజలు చేశారు. అక్కడి స్వామీజీ నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆలయ పూజారి వారిని శాలువాతో సత్కరించారు. రిషి సునక్‌ కుటుంబం భారతీయ మూలాలున్న వారని తెలిసిన విషయమే. అయితే ఆయన సతీమణి భారత్‌కు చెందిన అక్షతా మూర్తి. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధా మూర్తిల కుమార్తె ఆమె. 


శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆలయ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో బ్రిటన్‌ ప్రధాని తల్లిదండ్రులు, సుధా మూర్తి మంత్రాలయం సందర్శించినట్లు ఫోటోలతో పాటు పోస్ట్‌ చేశారు. 'ఈరోజు బ్రిటన్‌ ప్రధాని శ్రీ రిషి సునక్‌ తల్లిదండ్రులు యష్‌వీర్‌ సునక్, ఉషా సునక్‌ మంత్రాలయం క్షేత్రం సందర్శించారు. వారితో పాటు ఇన్ఫోసిస్‌కు చెందిన సుధా మూర్తి కూడా ఉన్నారు. వీరు శ్రీ రాయరుని దర్శనం చేస్తున్నారు' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. వారికి స్వామీజీ వస్త్రం, ఫల మంత్రాక్షతే, మెమెంటోను ఇచ్చి సత్కరించారని తెలిపారు. అలాగే పవిత్ర ప్రసాదాన్ని వారికి అందించి, రిషి సునక్‌ గారికి కూడా అందజేయాలన్నారని తెలిపారు. 


భారత్‌లో జరిగిన జీ 20 సదస్సు కోసం రిషి సునక్‌, అక్షతా మూర్తి భారత్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా వారు దిల్లీలోని అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అక్కడ స్వామీజీలతో మాట్లాడారు. ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్వామినారాయణ్‌ అక్షరధామ్‌ను సందర్శించడం పట్ల రిషి సునక్‌, అక్షతా మూర్తి ఆనందం వ్యక్తంచేశారు. రిషి సునాక్‌ తల్లిదండ్రులు కూడా భారత మూలాలు ఉన్నవారే. వారు తూర్పు ఆఫ్రికా మీదుగా బ్రిటన్‌కు వలస వెళ్లారు. రిషి సునాక్‌ అక్కడే జన్మించారు. 



జీ20 సదస్సు రెండో రోజు సమావేశం ప్రారంభానికి ముందే ఉదయాన్నే రిషి సునక్‌ దంపతులు అక్షరధామ్‌కు వెళ్లారు. ఆయన ఆలయంలో హారతి ఇచ్చి పూజలు చేశారని ఆలయ సిబ్బంది తెలిపారు. ఆయనకు అక్షరధామ్‌ ఆలయ నమూనాను బహుమతిగా ఇచ్చారు. అక్షతా మూర్తి కూడా భారత పర్యటనలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. అక్షరధామ్‌కు వెళ్లే సమయంలో గ్రీన్‌, మాగ్నెటా పింక్‌ సల్వార్‌ కమీజ్‌ వేసుకున్నారు. అలాగే తిరిగి యూకే వెళ్తున్నప్పుడు చీర కట్టుకుని వెళ్లారు. హిందూ సంప్రదాయం పట్ల తన గౌరవాన్ని చాటారు. 


తాను హిందువును అని, భారత మూలాలున్న వ్యక్తిని అని చెప్పుకోవడానికి గర్విస్తానని రిషి సునక్‌ భారత్‌ పర్యటనకు ముందే వెల్లడించారు. అలాగే ఆయన గతంలో మాట్లాడుతూ.. తనను భారత్‌ అల్లుడు అని పిలవడం చాలా సంతోషంగా ఉందని, అది ఎంతో ఆత్మీయమైన పిలుపు అని, భారత్‌ పర్యటనకు తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. భారత్‌ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. దిల్లీలో తనకు, తన భార్యకు నచ్చిన రెస్టారెంట్స్‌కు కూడా వెళ్తామని చెప్పారు. జీ 20 సమావేశాల కోసం మూడు రోజుల పాటు ఆయన దిల్లీలో ఉన్నారు.