లిబియాలో డేనియల్ తుపాను విధ్వంసానికి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా శవాలే కనిపిస్తున్నాయి. మరి కొన్ని వరద నీటిలో తేలియాడుతున్నాయ్. కనీవినీ ఎరుగని జలప్రళయంతో డెర్నా నగరం చెల్లాచెదురైంది. లిబియా చరిత్రలో ఎన్నడూ విధంగా డేనియల్ తుపాను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు 20 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. వేల మంది ఆచూకీ గల్లంతైంది. డెర్నా నగరంలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలిపే డెర్నా నదిపైన వంతెనలు కూలిపోయాయి. వరదలతో ఇళ్లు వాకిళ్లు పోగొట్టుకున్న వేలాది మంది నిర్వాసితులకు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. 7 మీటర్ల ఎత్తున వచ్చిన కెరటాలు నగరాన్ని పూర్తిగా తుడిచిపెట్టాయి. 


డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో అనేక నగరాలు వరద ప్రవాహానికి దెబ్బతిన్నాయి. సముద్రతీర పర్వత ప్రాంతమైన డెర్నా నగరంలోనే భారీగా ప్రాణనష్టం జరిగింది. గుర్తించిన మృతదేహాలను డెర్నా నగరంలోని సామూహికంగా ఖననం చేస్తున్నారు. నగరంలోని శిధిలాల కింద, వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను రేయింబవళ్లు సేకరించే పనిలో సహాయక సిబ్బంది నిమగ్నమయ్యారు. డెర్నాలోని రోడ్లను వరదలు పూర్తిగా ధ్వంసం చేయడంతో...స్థానికులు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వేలాది మృతదేహాలను పట్టణాలకు సమీపాన ఉన్న శవాగారాలకు పంపుతున్నారు. డెర్నా నుంచి టోబ్రక్ నగరంలోని మెడికల్ సెంటర్ మార్చురీకి 300 మృతదేహాలు పంపారు. డెర్నా, మరికొన్ని పట్టణాల్లో 40 వేల మంది నిర్వాసితులయ్యారని రెడ్ క్రాస్‌కు చెందిన లిబియా రాయబారి టామెర్ రమడాన్ చెప్పారు.


రెండు రోజుల నుంచి కూలిన భవనాలు, నేలమట్టమైన ఇళ్ల శిథిలాలను బుల్‌డోజర్లు సాయంతో తొలగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నాయ్. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు ముమ్మరం చేసిన కొద్ది శవాలు కుప్పలు తెప్పలుగా బయట పడుతుండటంతో.. డెర్నా నగరం భారీ స్మశానాన్ని తలపిస్తుంది. దీంతో అధికారులే.. సామూహికంగా ఒకే ప్రదేశంలో మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు. ఈజిప్టు, అల్జీరియా, టునీషియా, టర్కీ , యుఎఇ దేశాలు లిబియాకు అండగా నిలిచాయి. వరద బాధితులను ఆదుకోవడానికి సహాయక బృందాలను పంపించాయి. అమెరికా అత్యవసర నిధులను సహాయక సంస్థలకు పంపింది. లిబియా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తోందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వెల్లడించారు. 


కొన్నేళ్లుగా లిబియాలో నెలకొన్న పాలనాపరమైన సంక్షోభం నెలకొంది. ఒకప్పుడు లిబియాను పాలించిన నియంత గడాఫీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఆయన గద్దె దిగిపోయారు. 2014 నుంచి రెండు ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. అబ్దుల్ హమీద్‌బీబా రాజధాని నగరం ట్రిపోలి నుంచి పాలన సాగిస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. మరో పెద్ద నగరం బెంఘాజీ నుంచి ఒసామా హమద్ పాలిస్తున్నారు. దేశ తూర్పు ప్రాంతం ఆయన నేతృత్వంలో ఉంది. ఒసామాకు శక్తివంతమైన మిలిటరీ కమాండర్ ఖలిఫా హిఫ్తార్ మద్దతు ఉంది. ఇప్పుడు వీరంతా లిబియా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. గడాఫీ ప్రభుత్వం కూలిన తరువాత...20వ శతాబ్దంలోని భవనాలు అతివాద గ్రూపులకు ఆవాసంగా మారింది. 2011 తర్వాత అక్కడ పెద్దగా మౌలిక నిర్మాణాల కల్పన జరగలేదు. దెబ్బతిన్న డ్యామ్ ఒకదాన్ని 1970లో నిర్మించారు. నేతల నిర్లక్షంతో పెనునష్టం సంభవించినట్టు ఆరోపణలు ఉన్నాయి.