మాస్కో: రష్యాలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మృతిచెందారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Vladimir Putin) విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేత నావల్నీ(47) జైలులో శుక్రవారం మృతిచెందినట్లు సమాచారం. గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్‌ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా ఏజెన్సీలు ఇదే విషయాన్ని తెలిపాయని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది.






జైలు అధికారులు, రష్యా మీడియా ఏజెన్సీల తెలిపిన వివరాలు ప్రకారం.. నావల్నీ శుక్రవారం వాకింగ్ చేసిన తరువాత అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది సమయానికే స్పృహ కోల్పోయిన నావల్నీకి వెంటనే వైద్య సేవలు అందించినా ఫలితం లేకపోయింది. నావల్నీ చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. త్వరలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సిన ఉండగా.. పుతిన్ కు దీటుగా నిలిచే నావల్నీ చనిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ ఖైదీగా జైలుశిక్ష అనుభవిస్తున్న నావల్నీ.. కొన్ని నెలల కిందట జైలు నుంచి అదృశ్యమయ్యారని ప్రచారం జరిగింది. కొన్ని రోజులకు ఆయన ఆచూకీ లభించిందని నావల్నీ తరఫు న్యాయవాదులు, ప్రతినిధులు చెప్పారు. కానీ అప్పటినుంచే నావల్నీ  అనారోగ్యానికి గురయ్యారని వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వాకింగ్ చేసిన తరువాత ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైన ప్రతిపక్షనేత నావల్నీ మృతిచెందడం రాజకీయంగా కలకలం రేపుతోంది. 


రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు అవినీతి ఆరోపణలు చేశారు. యూట్యూబ్ ద్వారా ప్రజలకు చేరువ కావడంతో పాటు పుతిన్‌కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు నావల్నీ. రష్యా పాలక పక్షమైన యునైటెడ్ రష్యా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా రీసెర్చ్ చేసి కంటెంట్‌ను ప్రచురించడంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నావల్నీ మరణంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి తెలియజేసినట్లు ఆయన అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. 2010 దశకంలో క్రెమ్లిన్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు తనపై పుతిన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని గతంలో పలు ఇంటవ్వ్యూలలో నావల్నీ ఆరోపించారు. పుతిన్ అధికారంలో కొనసాగినంత కాలం తనకు విముక్తి దొరకదని పదే పదే ప్రస్తావించారు. పలు కేసుల్లో శిక్ష పడి, ఖైదీగానే జైలులో నావల్నీ మృతిచెందారు. ప్రభుత్వం నావల్నీ మరణంపై ఏ ప్రకటన చేస్తుందా అని రష్యా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.