మాంసాహారం తినేవారందరూ క్రూర స్వభావం ఉన్నవారు కాదు.. శాఖాహారం తినేవారందరూ సాత్వికులు కాదు. ఏం తిన్నా సరే చక్కగా సరైన పద్ధతిలో వండుకుని తినాలి. కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారం సైతం మన ప్రాణల మీదకి తెస్తుంది. కేవలం పచ్చి శాకాహారం మాత్రమే తిన్న ఓ మహిళ తీవ్ర అనారోగ్యం పాలై చనిపోయింది. ఇప్పుడు ఈ ఘటన తీవ్ర  చర్చనీయాంశంగా మారింది. 


కేవలం పచ్చి కూరగాయాలు, శాఖాహారం తినడంతో.. 
రష్యాకి చెందిన గ్జానా శాన్సనోవా అనే 39 ఏళ్ల వీగన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కేవలం పచ్చి కూరగాయాలు, శాఖాహారం తీసుకోవడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. గ్జానా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటూ వీగన్ రా ఫుడ్ తినమంటూ ప్రచారం చేసేది. అలా సంవత్సరాల తరబడి పూర్తిగా శాఖాహారం తినడం వల్లే ఆమె శరీరానికి అందాల్సి న పోషకాలు అందక ఆమె చనిపోయినట్లు వైద్యులు భావిస్తున్నారు. 


ఆన్‌లైన్‌లో గ్జానా డీ'ఆర్ట్ అనే పేరుతో ఈమె ఇన్ ఫ్లుయెన్సర్ గా ఉంది. తన సోషల్ మీడియా ఖాతాలలో పచ్చి కూరగాయలు, పండ్లు లాంటి ముడి ఆహారాల మీద ప్రచారం చేస్తుంది. ఆమె గత నెలలో ఆగ్నేయాసియా పర్యటనలో ఉండగా అనారోగ్యం పాలైంది. ఆ సమయంలో ఆమె తన ఇంటికి తిరిగి వచ్చింది . తరువాత ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో జులై 21న మరణించింది. 


గ్జానా సుమారు ఒక దశాబ్దం పాటు అన్ని రకాల పచ్చి శాఖాహారాన్నే తీసుకుంటుంది. "కొన్ని నెలల క్రితం, శ్రీలంక వెళ్లినప్పుడు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. అంతేకాకుండా ఆమె కాళ్లు బాగా ఉబ్బి వాచిపోయాయి. దాంతో ఆమె స్నేహితులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఫలితం లేకపోయింది. కానీ గ్జానా తల్లి మాత్రం తన కూతురు కలరా వంటి లక్షణాలతో చనిపోయిందని తెలుపుతున్నారు. అయితే గ్జానా మృతి చెందటానికి గల కారణాలు మాత్రం అధికారికంగా వైద్యులు ప్రకటించలేదు. గ్జానా శరీరం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి పెరిగిందని, ఆమె శరీరం బాగా అలసి పోయిందని ఆమె తల్లి వివరించింది. 


గ్జానా ఏడు సంవత్సరాల నుంచి మూడు పూటలా కూడా కేవలం పనస పండును మాత్రమే తినేదని, వేరే ఏం తిన్నా కూడా పచ్చివి మాత్రమే తినేదని పొరపాటున కూడా ఉడికించినవి తినేది కాదు అంటూ ఆమె స్నేహితులు చెబుతున్నారు. గ్జానా తన సోషల్‌ మీడియా వీడియోల్లో ఎప్పుడూ కూడా తన శరీరాన్ని ఆమె బాగా ప్రేమిస్తున్నట్లు, రా ఫుడ్‌ ని తీసుకోవడం వల్ల కొత్తగా రూపాంతరం చెందుతున్నట్లు ఆమె తెలిపేదని తెలుస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఆమె రా ఫుడ్‌ సిద్దాంతం గురించి ఆమె బాగా ప్రచారం చేసేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.