Aung San Suu Kyi Pardoned: నోబెల్ బహుమతి విజేత, మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి ఆ దేశ సైనిక ప్రభుత్వం ఆమెకు క్షమాభిక్షను ప్రసాదించింది. ఫలితంగా ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష తగ్గనుంది. ఈ మేరకు ఆ దేశ అధికార ప్రతినిధి జా మిన్ ఈ వివరాలు వెల్లడించారు. మయన్మార్‌లో నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా సూకీ, మాజీ అధ్యక్షుడు విన్ మైంట్ సహా ఏడు వేల మంది ఖైదీలకు అక్కడి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా ఆంగ్ సాన్ సూకీకి ఆరేళ్ల జైలు శిక్ష, విన్ మైంట్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష తగ్గనుంది.
రాజధాని నైపితాలో ప్రస్తుతం సూకీని హౌజ్ అరెస్టు లో ఉన్నారు. సోమవారం ఆమెను ప్రభుత్వ భవనానికి మార్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏడాదిగా ఆమె కఠిన జైలు జీవితాన్ని అనుభవించారు. ఎన్నికల్లో మోసాల కేసుల్లో ఆమె న్యాయస్థానంలో పోరాడుతున్నారు. తనపై చేసిన అభియోగాలను ఆమె ఖండిస్తున్నారు. ఆమెను విడుదల చేయాలని అంతర్జాతీయంగా ఒత్తిడులు రావడంతో అక్కడి సైనిక పాలక పక్షం క్షమాభిక్ష ప్రకటన చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
1989లో సైనిక పాలనకు వ్యతిరేకంగా సూకీ నిరసనలు చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆమెను గృహనిర్భందంలో ఉంచారు. ప్రజాస్వామ్య స్థాపనకు ఆమె చేసిన పోరాటం, కృషికి ఫలితంగా 1991లో ఆమెను నోబెల్ బహుమతి వరించింది. 2010లో ఆమెకు గృహనిర్భందం నుంచి విముక్తి లభించింది. 2015లో మయన్మార్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ మరోసారి విజయం సాధించింది. ఐదేళ్లలో సూకీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
కానీ సంస్కరణలను వ్యతిరేకించిన సైన్యం మళ్లీ తిరుగుబాటు చేసింది. అధికారం కోసం చూస్తున్న సైన్యం 2021లో సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి అక్కడ సైనిక పాలన సాగుతోంది. ఆ తర్వాత సూకీతోపాటు ఆమె అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో అవతవకలకు పాల్పడ్డారంటూ పాటు ఆంగ్ సాన్ సూకీని 19కిపైగా కేసుల్లో దోషిగా తేలుస్తూ మయన్మార్ కోర్టు ఆమెకు 33ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా క్షమాభిక్షలో భాగంగా వాటిలో నాలుగు కేసులను కొట్టేశారు. మరో 15 కేసుల్లో విచారణను ఎదుర్కోవాల్సి ఉంది.
2021 ఫిబ్రవరి సంక్షోభం తరువాత సూకీ ఒక్కసారి మాత్రమే ఫొటోల్లో కనిపించారు. అది కూడా మిలటరీ నిర్మిత రాజధాని నేపిడావ్‌లోని బేర్ కోర్ట్ రూమ్‌లో మీడియా తీసిన ఫోటోల్లో ఆమె చివరిసారి కనిపించారు. సైనిక తిరుగుబాటు ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని, 10 లక్షల మందికి పైగా వివిధ ప్రాంతాలు వెళ్లారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
మరోవైపు మయన్మార్‌లో ఎమర్జెన్సీని పొడిగిస్తూ సైనిక ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను జాప్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం ఆ దేశ రాజధానిలో సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్‌డీఎస్‌సీ) ఎమర్జెన్సీని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి వార్తా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి.