అమెరికాలో భారతీయ సంస్కృతికి మరో గౌరవం దక్కింది. అగ్రరాజ్యంలో ఓ వీధికి 'గణేశ్ టెంపుల్ స్ట్రీట్' అని పేరు పెట్టారు. ఇది హిందూ సమాజం గర్వపడే విషయమని ప్రవాస భారతీయులు పేర్కొన్నారు.
అరుదైన గౌరవం
గణేశ్ టెంపుల్ స్ట్రీట్‌గా మార్చిన ఈ వీధిలో 1977లో ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో మహా వల్లభ గణపతి దేవస్థానాన్ని స్థాపించారు. అప్పటినుంచి ఆ దేవాలయాన్ని గణేష్ టెంపుల్ అని పిలుస్తున్నారు. ఈ దేవాలయం న్యూయార్క్‌లో క్వీన్స్ కౌంటీలోని ఫ్లషింగ్‌లో ఉంది.
అక్కడున్న తెలుగువారు ఆ ఆలయానికి వెళ్లి పూజలు, అర్చనలు చేయడం ఆనవాయితీగా మారింది. ఇది ఉత్తర అమెరికాలోని పురాతన హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆ గుడి బయట ఉన్న వీధికి బౌనీ స్ట్రీట్ అని పేరు పెట్టారు. అయితే ఈ వీధికి గణపతి ఆలయం పేరును కూడా జత చేశారు. శనివారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో అధికారిక ప్రకటన చేశారు.
పూజారులు, పెద్ద సంఖ్యలో భక్తులు సమక్షంలో వీధి పేరును ఆవిష్కరించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు క్వీన్స్ బోరో ప్రెసిడెంట్ రిచర్డ్స్.
గణేశ్ ఉత్సవాలు
అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని మన భక్తులు కొనసాగిస్తున్నారు. న్యూజెర్సీ సాయి దత్త పీఠం గతేడాది గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సాయి దత్త పీఠం శ్రీ శివ, విష్ణు ఆలయంలో తొమ్మిది రోజుల పాటు గణేశ్ ఉత్సవాలను కనులపండువగా జరిపింది. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలతో ఆ గణనాథుడిని తీర్చిదిద్దడంతో ఆ వైభవాన్ని తిలకించడానికి భక్తులు నిత్యం ఎడిసన్‌లోని శ్రీ శివ, విష్ణు మందిరానికి భారీగా తరలి వచ్చారు. గణేశ్ ఉత్సవాల చివరి రోజు గణనాథుడికి భక్తులు 'జై బోలో గణేశ్ మహారాజ్' నినాదాల మధ్య అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం జరిగింది.
Also Read: Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఆ పక్షమే- పార్లమెంటులో విదేశాంగ మంత్రి క్లారిటీ
Also Read: Viral Video: కూతురికి ఏం గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చావు కాకా! అట్లుంటది మనతోని!