Sri Lanka President Gotabaya Rajapaksa Revokes State Of Emergency: శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ రద్దు నిర్ణయం ఏప్రిల్ 5 అర్ధరాత్రి నుంచే అమలులోకి రానుంది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మంగళవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, నిత్వావసర వస్తువుల ధరలు పెరగడం, ఆసుపత్రుల్లో ఔషధాల కొరత, పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తుండటం, విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి అత్యవసర పరిస్థితి (Emergency In Sri Lanka)ని విధించారు.


సోదరుడ్ని తప్పించి మంత్రి పదవి.. కానీ !
శ్రీలంక సంక్షోభం మరింత ముదురుతుండగా బాధ్యతలు చేపట్టిన ఆర్థిక మంత్రి అలీ సర్బీ 24 గంటలు గడవకముందే పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ప్రజలు మంగళవారం నాడు సైతం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో కొందరు సభ్యులు ప్రత్యేక కూటమిగా ఏర్పడాలని భావించారు. దాదాపు 50 మంది చట్ట సభ్యులు అధికార పక్ష కూటమిని వీడటంతో ప్రభుత్వం మైనార్జీ అయి, ప్రభుత్వం సైతం సంక్షోభంలో పడింది. వాస్తవానికి మంత్రుల రాజీనామాలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. అధికార కూటమి ఎస్ఎల్‌పీపీలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న తన సోదరుడు బాసిల్ రాజపక్సను ఆర్థిక మంత్రి పదవి నుంచి తప్పించి.. ఆ బాధ్యతలు అలీ సర్బీకి అప్పగించారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. కానీ ఒక్కరోజు వ్యవధిలోనే ఆయన సైతం పదవికి రాజీనామా చేయడంతో పరిస్థితులను చక్కబెట్టేందుకు ఎమర్జెన్సీ ఎత్తివేయడమే సరైన నిర్ణయమని భావించి రాత్రికి రాత్రే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.






మైనార్టీలో శ్రీలంక ప్రభుత్వం !
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నాయకులు తమ మంత్రిత్వ శాఖలో చేరాలని, తద్వారా సంక్షోభం పరిష్కరానికి దిశగా అడుగులు వేద్దామన్నారు. కానీ అధికార పార్టీ సభ్యులే వేరు కుంపటి పెట్టుకోవడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 సీట్లు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే సాధారణ మెజార్టీ 113 మంది సభ్యులు కావాలి. గత ఎన్నికల్లో ఎస్‌ఎల్‌పీపీ కూటమి 150 స్థానాలు నెగ్గి అధికారం చేపట్టింది. కానీ ప్రస్తుత సంక్షోభ సమయంలో 40 నుంచి 50 మంది సభ్యులు అధికార కూటమిని వీడారని సమాచారం. దాంతో ప్రధాని మహింద రాజపక్స ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. తమకు మెజార్జీ ఉందని అధికార కూటమి నేతలు వాదిస్తున్నారు. 


Also Read: Sri Lanka Economic Crisis: సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా- విపక్షాలకు అధ్యక్షుడి బంపర్ ఆఫర్


Also Read: Sri Lanka PM Resigns: ప్రధాని రాజపక్సా రాజీనామా చేయలేదు - క్లారిటీ ఇచ్చిన పీఎంవో