ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై భారత్ ఇప్పటివరకు తటస్థ వైఖరినే అవలంబించింది. అయితే బుచా నగరంలో ఉక్రెయిన్ పౌరులపై జరిగిన ఊచకోత తర్వాత భారత్ స్వరం మారింది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని భారత్ డిమాండ్ చేసింది. ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్.. లోక్‌సభలో ఇలా మాట్లాడారు.
బుచా నగరంలో జరిగిన హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోసం మద్దతు ఇస్తున్నాం. ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలను భారత్ ప్రోత్సహిస్తుంది, శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయాలి. సాధారణ పౌరులు ఎలాంటి సమస్యలకు గురికాకుండా చూడాలని భారత్ కోరుతోంది. మనం యుద్ధానికి వ్యతిరేకం. అమాయకుల ప్రాణాలు తీయటం, రక్తపాతంతో పరిష్కారం లభించదని భారత్ గట్టిగా నమ్ముతోంది. గట్టిగా నమ్ముతున్నాం. ప్రస్తుత రోజుల్లో ఏ సమస్యకైనా దౌత్యపరంగా చర్చించటమే సరైన సమాధానం. భారత్ ఒక పక్షాన్ని ఎంచుకోవాల్సి వస్తే అది శాంతి పక్షమే. ఐరాసతో పాటు అంతర్జాతీయ వేదికలు, చర్చల్లో ఇదే మా వైఖరిగా తెలియజేస్తూ వస్తున్నాం. - జై శంకర్, భారత విదేశాంగ మంత్రి
విద్యార్థుల కోసం
తమ దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తోన్న విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని జై శంకర్ తెలిపారు.
ఉక్రెయిన్‌లో మూడో సంవత్సరం మెడికల్ విద్యార్థుల కేఆర్ఓకే 1 పరీక్షను వచ్చే వార్షిక సంవత్సరానికి వాయిదా వేసేందుకు ఆ దేశ ప్రభుత్వం అంగీకరించింది. స్టాండర్డ్ రిక్వైర్‌మెంట్ పూర్తయిన విద్యార్థులను అక్కడ ప్రభుత్వం పాస్ చేస్తుంది. - జై శంకర్, భారత విదేశాంగ మంత్రి
భద్రతా మండలిలో
ఐరాస భద్రతా మండలి సమావేశంలో కూడా ఈ ఘటనను భారత్ ఖండించడమే కాకుండా స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు.
యుద్ధంలో భద్రతా పరిస్థితి క్షీణించింది, అలాగే మానవతా విలువలు కూడా క్షీణించాయి. ఇటీవల బుచాలో పౌర హత్యలకు సంబంధించిన నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మేము ఈ హత్యలను నిస్సందేహంగా ఖండిస్తున్నాము. స్వతంత్ర దర్యాప్తు పిలుపుకు మద్దతు ఇస్తున్నాం. - టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి