గాజా(Gaza)పై ఇజ్రాయెల్‌(Israeli) సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ బాంబ్ దాడులతో గాజా చెల్లాచెదురైంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనా ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్‌ డాలర్ల మానవతా సాయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(US President Joe Biden)  ప్రకటించారు. యుద్ధ ప్రభావిత పాలస్తీనియన్లకు తాము చేసిన సాయం ఉపయోగపడుతుందన్నారు. అమెరికా ఉన్నంత కాలం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. అలాగే, మెజారిటీ పాలస్తీనా ప్రజలకు హమాస్‌తో అసలు సంబంధం లేదన్నారు జోబైడెన్.


అది హామాస్ పనేనన్న బైడెన్
సెంట్రల్‌ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడి ఇజ్రాయెల్‌ చేయలేదన్నారు జో బైడెన్. అది ఇజ్రాయెల్‌ పని కాదన్న ఆయన, ఆ దాడికి కారణం ఏంటనే విషయం కచ్చితంగా తెలియదన్నారు. హమాస్‌ మిలిటెంట్లు 1300 మందిని చంపారని, వారిలో 31 మంది అమెరికన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. హమాస్‌ మిలిటెంట్లు కొందర్ని బందీలుగా చేసుకోవడం దారుణమన్నారు. అది మిలిటెంట్ల పనేననన్న ఆయన, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu)తో ఇదే చెప్పానన్నారు. ఆసుపత్రిపై దాడి ఘటన తనకెంతో ఆగ్రహం కలిగించిందన్నారు బైడెన్‌. హమాస్‌ మిలిటెంట్లపై పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. గాజాలోని ఆసుపత్రిపై దాడికి ఇజ్రాయెల్‌ బాధ్యత కాదని అమెరికా చెప్పడాన్ని హమాస్‌ తోసిపుచ్చింది. అది అవాస్తవమని, కేవలం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకే అలా చెప్పిందని మండిపడింది. 


తెరుచుకోనున్న రఫా సరిహద్దు
ఇజ్రాయెల్‌ దాడులతో గాజా ప్రాంతమంతా ధ్వంసమైంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాజాకి అమెరికా మానవతా సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బాధితులకు సాయం చేసేందుకు గాజాలోకి ప్రవేశించాలంటే గాజా-ఈజిప్ట్‌ సరిహద్దులో ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్‌ను దాటాల్సి ఉంటుంది. కొంతకాలంగా దీన్ని ఈజిప్ట్‌(Egypt) మూసివేసింది. ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌ సిసితో అమెరికా అధ్యక్షుడు బైడెన్ చర్చించడంతో, రఫా బార్డర్‌ క్రాసింగ్‌ తెరిచేందుకు ఆయన అంగీకరించారు. దీంతో గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమమైంది. రఫా బార్డర్‌ తెరిచి మానవతా సాయం కింద ఇచ్చే సామగ్రితో కూడిన 20 ట్రక్కులను గాజాలోకి పంపించడానికి ఒప్పుకొన్నట్లు తెలిపారు. 


ఐక్యరాజ్యసమితి అభ్యర్థనతో అమెరికా, ఈజిప్ట్  దేశాలు గాజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో స్థిరత్వం, శాంతి నెలకొల్పడానికి కృషి చేయనున్నాయి. అమెరికా, ఈజిప్ట్‌ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరుదేశాల అధినేతలు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. సెంట్రల్‌ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ జరిపిన దాడి సమర్థించలేనిదన్నారు సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌. ఆసుపత్రిపై దాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. ఆ ప్రాంత భవిష్యత్తు మొత్తం అనిశ్చితిలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.