Gaza Hospital Attack: 



పుతిన్ ఏం అన్నారంటే..


గాజా హాస్పిటల్‌ దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) స్పందించారు. ఇది చాలా దారుణం అని, వెంటనే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఈ యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటన్నట్టు చెప్పారు. చర్చలు ఎంత అవసరమో ఇలాంటి భయంకర ఘటనలతోనే అర్థమవుతుందని అన్నారు. 


"గాజాలోని హాస్పిటల్‌పై దాడి జరిగిన తీరు చాలా దారుణం. ఇంత ఘోరం జరగడం బాధాకరం. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఇప్పటికైనా ఇజ్రాయేల్,పాలస్తీనా మధ్య వివాదం పరిష్కారమవుతుందని భావిస్తున్నాను. వీలైనంత త్వరగా ఇది సద్దుమణగాలని కోరుకుంటున్నాను. చర్చలకు ఏ మాత్రం అవకాశమున్నా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాల్సిన అవసరముంది"


- పుతిన్, రష్యా అధ్యక్షుడు 


చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన తరవాత పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధంపై స్పందించారు పుతిన్. హమాస్‌ అరాచకాలను అడ్డుకునేందుకు ఇజ్రాయేల్‌కి తనను తాను డిఫెండ్ చేసే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. అంతే కాదు. పాలస్తీనాను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించి..ఈస్ట్ జెరూసలేంని రాజధానిగా ప్రకటించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని అభిప్రాయపడ్డారు. పాలస్తీనా- ఇజ్రాయేల్ వివాదంపై ఎన్ని చర్చలు జరిగినా ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్..ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు. 


"ఐక్యరాజ్య సమితి గతంలో సూచించినట్టుగా పాలస్తీనాకు స్వతంత్ర హోదా ఇవ్వాలి. ఈస్ట్ జెరూసలేంని రాజధానిగా ప్రకటించాలి. అప్పుడే పొరుగున ఉన్న ఇజ్రాయేల్‌తో శాంతియుత వాతావరణం ఉంటుంది. కానీ...ప్రస్తుతం అంతా అలజడే ఉంది. హమాస్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా ఇజ్రాయేల్‌పై దాడి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను తాను డిఫెండ్ చేసుకునే హక్కు ఇజ్రాయేల్‌కి తప్పకుండా ఉంటుంది. తమ దేశంలో శాంతి నెలకొల్పే బాధ్యత ఉంటుంది. శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించడం చాలా సవాలుతో కూడుకున్న పనే. అందుకే..పాలస్తీనాకి స్వతంత్ర హోదా ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నాను"


- పుతిన్, రష్యా అధ్యక్షుడు 


ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీతో మాట్లాడారు పుతిన్. ఈ సమావేశంలోనే అమెరికా విధానాన్ని ఖండించారు. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పాలసీ ఫెయిల్‌ అయిందనడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఇంకేదీ ఉండదని తేల్చి చెప్పారు. వీలైనంత త్వరగా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. "స్వతంత్ర హోదా" కావాలన్న పాలస్తీనా ఆకాంక్షల్ని అమెరికా పట్టించుకోలేదని మండి పడ్డారు. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య యుద్ధం విధ్వంసం సృష్టిస్తోంది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. గాజా వద్ద పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. 


Also Read: గాజా హాస్పిటల్‌పై దాడి చేసింది ఇజ్రాయేల్ కాదని తెలుసు, నెతన్యాహుతో జో బైడెన్‌