Gaza Hospital Attack:
టెల్ అవీవ్‌కి బైడెన్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) టెల్ అవీవ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో(Benjamin Netanyahu) భేటీ అయ్యారు. గాజాలోని ఓ ఆసుపత్రిపై దాడులు జరిగి 500 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జో బైడెన్ భేటీ కీలకంగా మారింది. ఇజ్రాయేల్‌కి ముందు నుంచి మద్దతునిస్తోంది అగ్రరాజ్యం. ఈ సారి నేరుగా బైడెన్ వెళ్లి నెతన్యాహుని కలిశారు. అంతే కాదు. గాజాలోని హాస్పిటల్‌పై దాడి చేసింది ఇజ్రాయేల్ కాదని తేల్చి చెప్పారు. అది కచ్చితంగా ఉగ్రవాదులు చేసిన పనే అని అన్నారు. ఈ సందర్భంగా నెతన్యాహు బైడెన్‌కి థాంక్స్ చెప్పారు. ఇజ్రాయేల్‌కి మద్దతుగా ఉంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. గత వారమే యూఎస్ స్టేట్ సెక్రటరీ యాంటోని బ్లింకెన్ టెల్ అవీవ్‌లో పర్యటించారు. ఇలా వరుస పర్యటనలతో అమెరికా సపోర్ట్ ఇస్తూ వస్తోంది.
"గాజా హాస్పిటల్‌పై జరిగిన దాడి ఎంతో ఆవేదనకు గురి చేసింది. నాకు తెలిసినంత వరకూ ఇది కచ్చితంగా ఇజ్రాయేల్ పనైతే కాదు. వేరేవరో చేసిన పని ఇది. ఈ దాడి మీరు చేయలేదు(ఇజ్రాయేల్‌ని ఉద్దేశిస్తూ). కానీ అంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇప్పటి వరకూ హమాస్ ఉగ్రవాదులు 1300 మంది ప్రాణాల్ని బలి తీసుకున్నారు. అందులో 31 మంది అమెరికన్లూ ఉన్నారు. పిల్లలతో సహా చాలా మందిని బందీలుగా చేసుకున్నారు. ఐసిస్ కన్నా క్రూరంగా ప్రవర్తించారు"
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
థాంక్స్ చెప్పిన నెతన్యాహు..
బైడెన్ వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి స్నేహితుడు తమ వైపు ఉండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తమకు మద్దతుగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
"మీలాంటి మంచి మిత్రుడు అండగా ఉండడం ఇజ్రాయేల్ ప్రజలకు ఆనందంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మా దగ్గరకి వచ్చి మరీ మద్దతునిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇది మమ్మల్ని ఎంతో కదిలించింది. ఇజ్రాయేల్‌కి మీరు ప్రతి సందర్భంలోనూ మద్దతుగా ఉంటున్నందుకు థాంక్యూ"
- బెంజిమన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధాని