Israel Palestine Attack: 

బందీల్ని వదిలేస్తాం..

ఇజ్రాయేల్‌, హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తరవాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హమాస్‌ని అంతం చేసేంత వరకూ వదలం అని ఇజ్రాయేల్ ప్రకటించింది. అటు హమాస్ కూడా గాజాలోని పౌరులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేస్తోంది. ఈ పరిణామాల మధ్యే హమాస్‌ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికిప్పుడు ఇజ్రాయేల్‌ దాడులు చేయడం ఆపేస్తే తమ బందీలుగా ఉన్న పౌరులందరినీ విడుదల చేస్తామని వెల్లడించింది. హమాస్ సీనియర్ అధికారి ఒకరు అక్కడి మీడియాకి ఈ ఇదే విషయం చెప్పారు. గాజా నుంచి ఇజ్రాయేల్ సైన్యం తక్షణమే వెళ్లిపోవాలని, అలా చేస్తే గంటలోగా బందీలందరినీ వదిలేస్తామని తేల్చి చెప్పారు. గాజా సిటీ హాస్పిటల్‌పై ఇజ్రాయేల్ దాడి చేసిన తరవాతే ఈ ప్రకటన చేసింది హమాస్. ఇజ్రాయేల్ మిలిటరీయే ఈ దాడి చేసిందన్న ఆరోపణల్ని మిలిటరీ తీవ్రంగా ఖండించింది. పాలస్తీనాకి చెందిన ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్‌ రాకెట్‌ లాంఛ్ ఫెయిల్ అయ్యి హాస్పిటల్‌పై పడిపోయిందని, అందుకే ఇంత నష్టం వాటల్లిందని ఇజ్రాయేల్ స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలూ చూపించింది. 

"IDF ఆపరేషనల్ సిస్టమ్‌తో అనాలసిస్‌ చేశాం. ఇజ్రాయేల్‌పైకి రాకెట్‌లు లాంఛ్ చేశారు. అవి ఫెయిల్ అయ్యి నేరుగా హాస్పిటల్‌పైకి దూసుకెళ్లాయి. ఇంటిలిజెన్స్ సమాచారం ప్రకారం...ఇస్లామిక్ జిహాద్ టెర్రరిస్ట్ సంస్థ వల్లే ఈ దాడులు జరిగాయి"

- ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ 

ఈ దాడిలో దాదాపు 500 మంది బలి అయ్యారు. ఇది కచ్చితంగా ఇజ్రాయేల్ పనే అని పాలస్తీనా తీవ్రంగా మండి పడుతోంది. పాలస్తీనా అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్ మూడు రోజుల పాటు సంతాపం పాటించాలని ప్రకటించారు. ఈ మారణ హోమాన్ని అడ్డుకోడానికి అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిశబ్దంగా ఉండడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. 

గాజా నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న ముప్పేట దాడిలో గాజా స్ట్రిప్ వణికిపోతోంది. మంగళవారం సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన భారీ వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. పలువురు గాయపడ్డారు. పాలస్తీనా అథారిటీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సులు, ఇతర వాహనాల్లో మరో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉత్తర గాజాను విడిచిపెట్టి, తక్షణమే దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం పాలస్తీనియన్లను ఆదేశించింది. అయితే మంగళవారం అక్కడ కూడా భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. భారీగా రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. 

Also Read: ఫ్యుయెల్ కొనుక్కోడానికి డబ్బుల్లేక ఆగిన ఫ్లైట్‌లు, పాపం పాకిస్థాన్‌