Israel Hamas War Updates: గాజా నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న ముప్పేట దాడిలో గాజా స్ట్రిప్ వణికిపోతోంది. మంగళవారం సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన భారీ వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. పలువురు గాయపడ్డారు. పాలస్తీనా అథారిటీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సులు, ఇతర వాహనాల్లో మరో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. 


అత్యంత దారుణం
ఈ మారణ హోమాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్‌ ఈ దాడిని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా ? కాదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడి అత్యంత రక్తపాత సంఘటనగా పాలస్తీనా పేర్కొంది. యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ ఇజ్రాయెల్‌ను సందర్శించిన తర్వాత ఈ వైమానిక దాడి జరిగిందని ఆరోపించింది. ఈ దారుణ ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. దాడికి ముందు ఆ ఆస్పత్రిలో మూడువేల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. 


ప్రతికారం తీర్చుకుంటాం
రఫాలో 27 మంది, ఖాన్‌ యూనిస్‌లో 30 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బసీమ్‌ నయీం చెప్పారు. గాజాలోని హమాస్‌ ప్రభుత్వంలోని ఆసుపత్రిలో ఊచకోత కోశారని ఆరోగ్య మంత్రి మై అల్కైలా ఆరోపించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆరోపించారు. అత్యంత అమానవీయంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని విమర్శించారు. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనను వార్ క్రైమ్‌గా అభివర్ణించారు. ఈ దాడిలో 500 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్‌ 11 రోజుల బాంబు దాడిలో 3,000 మంది మరణించారని గాజాలోని ఆరోగ్య అధికారులు చెప్పారు. 


ఛిద్రమైన శరీరాలు
ఉత్తర గాజాను విడిచిపెట్టి, తక్షణమే దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం పాలస్తీనియన్లను ఆదేశించింది. అయితే మంగళవారం అక్కడ కూడా భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. భారీగా రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. దక్షిణ గాజాలోని రఫా, ఖాన్‌ యూనిస్‌ నగరాల్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఆసుపత్రిపై జరిపిన దాడిలో ఆస్పత్రి పరిసరాలన్నీ భయానకంగా మారిపోయాయి. ఆస్పత్రిలోని హాళ్లు దగ్ధమయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వదిలిపెట్టే ప్రసక్తే లేదు
దక్షిణ గాజాపై దాడులు చేయడంపై ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి స్పందించారు. హమాస్‌ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక సదుపాయాలను, కమాండ్‌ సెంటర్లను ధ్వంసం చేయడానికే దక్షిణ గాజాపై రాకెట్లు దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ చెప్పారు. హమాస్‌ కదలికలు ఎక్కడ కనిపించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులను హమాస్ ప్రతిఘటిస్తోంది. పలు నగరాలపై మోర్టార్లను సంధిస్తోంది. ఈ పరస్పర దాడుల్లో 4,000 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.