Tony Fernandes: ఆయన ఉన్నత స్థాయి వ్యక్తి, ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి. కానీ ఆయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒంటి మీద చొక్కా లేకుండా లైవ్‌కు వచ్చారు. అంతేకాదు అక్కడ ఓ మహిళతో మసాజ్ చేయించుకున్నారు. పైగా అది తమ వర్క్ నేచర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిని సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. 


వివరాలు.. మలేసియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఎయిర్‌ ఏషియా (AirAsia CEO)  దీని సీఈఓగా టోనీ ఫెర్నాండెజ్‌ ఉన్నారు. ఆయన తాజాగా లింక్డిన్‌, ఎక్స్‌(ట్విటర్)లో ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో ఆయన పేర్కొంటూ.. షర్ట్‌ లేకుండా (shirtless) ఆయన ఒక వర్చువల్‌ మీటింగ్‌కు హాజరైనట్లు చెప్పారు. మసాజ్‌ చేసుకుంటూ మేనేజమెంట్‌ మీటింగ్‌కు ఇలా హాజరైనట్లు ఆయనే స్వయంగా ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు. 


అందులో వారం అంతా ఒత్తిడి కారణంగా మస్సాజ్ చేయించుకున్నట్లు చెప్పారు. ఎయిర్‌ ఏషియాలో పని సంస్కృతికి నిదర్శనం అని, అది వారి వర్క్ కల్చర్ అంటూ పేర్కొన్నారు. అంతే కాదు తాము పెద్ద పురోగతి సాధించబోతున్నామని, ఇప్పటికే కాపిటల్ స్ట్రక్షర్‌ను ఫైనలైజ్ చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజులు మరింత ఉత్తేజకరంగా ఉంటాయని, తాము సాధించిన దానికి గర్వపడుతున్నామని, ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ పెట్టిన కాసేపటికే అది వైరల్‌గా మారింది.


టోనీ ఫెర్నాండెజ్‌ చేసిన పని విమర్శలకు కారణమైంది. ఆయన తీరుపై నెటిజన్లు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రేంజ్‌లో విమర్శలు ఎక్కుపెట్టారు. మసాజ్‌ చేసుకుంటూ వర్చువల్ మీటింగ్‌‌లో పాల్గొనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘ఒక లిస్టెడ్‌ కంపెనీకి సీఈఓగా ఉంటూ.. మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌కు ఇలా షర్ట్‌లేకుండా హాజరవ్వడం ఏమాత్రం సభ్యత అనిపించుకోదు’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టారు. బహుశా ఎవరో ఆయన లింక్డిన్‌ను హ్యాక్‌ చేసి ఉంటారని మరో యూజర్ రాసుకొచ్చారు. 


‘మీ వర్క్‌ కల్చర్‌ చూపించడానికి ఇది సరైన పద్ధతి కాదు’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. ‘ఓపెన్‌ కల్చర్‌ అంటే మరీ ఇంత ఓపెన్‌ అనుకోలేదు’ అంటూ మరో నెటిజన్‌ వ్యంగ్యంగా అన్నారు. ఇలా ఎవరైనా మీటింగుల్లో పాల్గొంటారా అంటూ ప్రశ్నించారు. మరి కొందరు అయితే నీ పని బాగుందంటూ సటైర్లు వేస్తున్నారు. పర్సనల్ పనులను పబ్లిక్‌లో పెట్టడం ఏంటని మరి కొందరు ఘాటుగా వ్యా్ఖ్యానిస్తున్నారు. ఇలా ఎలా చేయగలిగావంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ ఫెర్నాండెజ్‌ సదరు పోస్ట్‌ను డిలీట్‌ చేయలేదు. అయితే కొందరి కామెంట్లను మాత్రం డిలీట్‌ చేశారు.