Green Card: అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే కాలం త్వరలోనే పోనుంది. ఈ ప్రక్రియను ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని అమెరికా అధ్యక్ష సలహా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.
బైడెన్ టేబుల్‌పై
గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లను ఆరు నెలల్లోగా క్లియర్ చేయాలని అమెరికా అధ్యక్ష సలహా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం అధ్యక్షుడు బైడెన్‌కు తమ ప్రతిపాదనలను పంపనుంది. ఒకవేళ బైడెన్ సర్కార్ ఆ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపితే ఇక గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియ వేగవంతం కానుంది.
భారతీయ అమెరికన్ నేత అజయ్ జైన్ భుటోరియా నేతృత్వంలోని బృందం ఈ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను 25 మంది కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఏషియన్ అమెరికన్లు, స్థానిక హవాయి ప్రజలు, పసిఫిక్ దీవులకు చెందిన వాళ్లతో ఏర్పడిన ఈ అడ్వైజరీ కమిషన్ చేసిన ప్రతిపాదనలను ఆమోదం కోసం శ్వేతసౌధానికి పంపనున్నారు.
భారతీయులు
ఈ తీర్మానం అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నవారికి ఊరట లభించనుంది. 2021లో కేవలం 65,452 మందికి గ్రీన్ కార్డు జారీ చేశారు.
అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే పత్రమే గ్రీన్ కార్డ్. హెచ్1బీ వీసాలపై అగ్రరాజ్యానికి వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఈ గ్రీన్ కార్డ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కొందరు గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే అలాంటి వారికి లబ్ధి చేకూరనుంది.
Also Read: Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
Also Read: Sweden NATO Membership: నాటో కూటమిలో చేరేందుకు స్వీడన్ సై- పుతిన్ స్వీట్ వార్నింగ్