Sweden NATO Membership:


స్వీడన్ దేశం కీలకం నిర్ణయం తీసుకుంది. ఫిన్లాండ్‌ తరహాలోనే తాము నాటో సభ్యత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు స్వీడన్‌ ప్రధాని మాగ్దలీనా అండర్సన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు యుద్ధం చేస్తోన్న వేళ స్వీడన్ నిర్ణయం కీలకంగా మారింది.




రక్షణ హామీలు


అధికారికంగా నాటోలో చేరడమే కాకుండా రక్షణ పరమైన హామీలు కూడా తమకు కావాలని స్వీడన్ ప్రధాని మాగ్దలీనా అన్నారు. నాటోలో చేరే విషయంపై సోమవారం స్వీడన్ పార్లమెంట్​లో చర్చ జరిగింది. అయితే మెజార్టీ సభ్యులు నాటోలో చేరేందుకు మద్దతు పలికారు.


పుతిన్ వార్నింగ్


ఫిన్లాండ్‌, స్వీడన్‌లు నాటోలో చేరేందుకు ప్రయత్నించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ రెండు దేశాలు నాటోలో చేరితే తమకు ఎలాంటి సమస్య లేదని పుతిన్‌ ప్రకటించారు. దీని వల్ల రష్యాకు ప్రత్యక్ష ముప్పు లేదన్నారు. కానీ సరిహద్దుల్లో సైనిక చర్యలు, మౌలిక సదుపాయాల విస్తరణకు పాల్పడితే మాత్రం అది ప్రతిచర్యకు దారి తీయవచ్చని హెచ్చరించారు.


ఉక్రెయిన్​పై రష్యా దాడి చేయకముందు స్వీడన్, ఫిన్లాండ్ దేశంలోని ప్రజలు నాటోలో చేరడాన్ని వ్యతిరేకించారు. అయితే, తాజా పరిణామాలతో ఈ రెండు దేశాల ప్రజలు నాటోలో చేరడమే తమ దేశానికి మేలు అని భావిస్తున్నారని పలు సర్వేల్లో తేలింది.


ఫిన్లాండ్


నాటో కూటమిలో ఫిన్లాండ్ తక్షణమే చేరాలని ప్రయత్నిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు సౌలీ నీననిస్టో, ప్రధాని సన్నా మారిన్ ఇటీవల సంయుక్త ప్రకటన చేశారు. ఇప్పటికే సభ్యత్వ దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు.


రష్యా, ఫిన్లాండ్ మధ్య ఇంతకుముందు సరిహద్దు సమస్యలు వచ్చాయి. ఈ రెండు దేశాల మధ్య 1,340 కిలోమీటర్ల (830 మైళ్లు) మేర సరిహద్దు ఉంది. దీంతో ఉక్రెయిన్‌ తరహాలోనే రష్యా.. ఫిన్లాండ్‌పై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశం భయపడుతోంది. దీంతో వీలైనంత త్వరగా నాటో కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తోంది.


Also Read: Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!


Also Read: Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!