Parag Agrawal On Twitter Spam:
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్ల విషయంలో ఇద్దరి మధ్య రాజుకున్న రచ్చ మాములుగా లేదు. ఫేక్ అకౌంట్ల విషయంలో చాలా పక్కగా ఉంటున్నామని పరాగ్ ట్వీట్ చేస్తే దానికి ఎమోజీతో రిప్లై ఇచ్చి మస్క్ హీట్ పెంచాడు. అసలు ఈ ఇద్దరి మధ్య గొడవేంటి?
ఇక్కడ మొదలు
ట్విట్టర్ కొనుగోలుకు సిద్ధమైనప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఆ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. అయితే వీటికి ట్విట్టర్ సీఈఓ పరాగ్ కూడా తగ్గేదేలే అన్నట్లు రిప్లై ఇస్తున్నాడు. ట్విటర్.. మస్క్ సొంతమవుతుందని తెలిసినా పరాగ్ వెనక్కి తగ్గడం లేదు.
ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్లు 5 శాతం మించి ఉండవని ఆ సంస్థ మేనేజ్‌మెంట్ చెప్పిన వివరాలపై ఎలాన్ మస్క్ సంతృప్తి చెందలేదు. ఫేక్ అకౌంట్ల వివరాల్లో క్లారిటీ రాని పక్షంలో ట్విట్టర్‌ను టేకోవర్ చేసే విషయం పునరాలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
ఫేక్‌పై క్లారిటీ
మస్క్ చేసిన ఈ హెచ్చరికలపై పరాగ్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. తమ టీమ్ ఫేక్/ స్పామ్ అకౌంట్లను పట్టుకోవడంలో నిరంతరం శ్రమిస్తుందని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా వీటిని గుర్తించేందుకు ఎంతగా శ్రమిస్తున్నారో తెలిసేలా వరుస ట్వీట్లు చేశాడు.
మస్క్ వెటకారం
పరాగ్ అగర్వాల్ చేసిన ఈ ట్వీట్లు అన్నింటికి వ్యంగంగా కామెడీ చేసే ఓ ఎమోజీని రిప్లైగా పెట్టాడు మస్క్. ఇలా అయితే అడ్వర్టైజర్లు వాళ్లు ఖర్చుపెడుతున్న డబ్బులకు తిరిగి ఏం వస్తుందనే విషయం ఎలా తెలుస్తుందని మస్క్ ప్రశ్నించారు. ట్విట్టర్ ఫైనాన్షియల్ హెల్త్‌కు ఇది ప్రాథమికమని మస్క్ ట్వీట్ చేశారు.
ఈ వివాదంపై నెటిజన్లు కూడా భారీగానే స్పందిస్తున్నారు. ట్విట్టర్ సీఈఓను మస్క్ ఓ ఆట ఆడుకుంటున్నాడని కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు. మరికొంతమంది ట్విట్టర్ పారదర్శకంగా ఉండాలంటే స్పామ్ అకౌంట్ల విషయంలో బయటి వాళ్ల చేత వెరిఫై చేయించాలని కోరుతున్నారు.
Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!