Joe Biden Trolled:



వైరల్ అవుతున్న వీడియో..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసే కామెంట్స్ అప్పుడప్పుడూ చాలా వింతగా అనిపిస్తుంటాయి. సోషల్ మీడియాలోనూ ట్రోల్ అవుతుంటాయి. ఇటీవలే చైనాను పొగిడి విమర్శలు ఎదుర్కొన్న బైడెన్...ఇప్పుడు మరోసారి వింత వ్యాఖ్యలు చేశారు. పసిఫిక్ సముద్రం నుంచి హిందూమహాసముద్రం వరకూ రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వీడియో వైరల్ అవుతోంది. "మా ప్రభుత్వం పసిఫిక్ సముద్రం నుంచి హిందూమహా సముద్రం వరకూ రైల్వే మార్గాన్ని నిర్మించాలని చూస్తోంది" అని బైడెన్ చెప్పడంపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. అంతలోనే అప్రమత్తమై "స్క్రిప్ట్‌లో లేనిది మాట్లాడుతున్నానా" అని నవ్వుకున్నారు. ఇది విని హాల్‌లో ఉన్న వాళ్లంతా గట్టిగా నవ్వారు. 


"పసిఫిక్ మహా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకూ రైల్వే మార్గం నిర్మించాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంగోలాలో అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ కట్టాలనీ ఆలోచిస్తున్నాం. మేం ఇవన్నీ చేయొచ్చు. కానీ నాకెందుకో నేను దారి తప్పి మాట్లాడుతున్నాను అనిపిస్తోంది. బహుశా నేను చిక్కుల్లో ఇరుక్కుంటున్నానేమో"


- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు 






ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేసినప్పటి నుంచి కామెంట్స్‌ మోత మోగిపోతోంది. "ఈ పెద్దాయనను రెస్ట్ తీసుకోమని చెప్పండి" అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తుండగా...మరి కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. "సో..ఈ సారి నేను ఇండియాకు ట్రైన్‌లో వెళ్లిపోవచ్చన్నమాట" అని సెటైర్లు వేస్తున్నారు. 


కెనడాలో ఇలా..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తరచూ వార్తలో ఉంటారు. సంచలన నిర్ణయాలతో కాదు. స్పీచ్‌లతో. అవును. ఆయన ప్రసంగించిన ప్రతిసారీ ఏదో ఓ పొరపాటు చేస్తుంటారు. అది కాస్తా వైరల్ అవుతుంది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. కెనడాకు బదులుగా చైనాను పొగిడి ఆ తరవాత వెంటనే తప్పు సరిదిద్దుకున్నారు. అప్పటికే చుట్టూ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా గొల్లున నవ్వారు. కెనడా పార్లమెంట్‌లో ప్రసంగించిన సమయంలో జరిగిందీ ఘటన. అక్కడి వలస చట్టాల గురించి ప్రస్తావించారు బైడెన్. ఆ చట్టాలను ప్రశంసించే సమయంలో "కెనడా" పేరు బదులు "చైనా" పేరు ప్రస్తావించారు. వెంటనే తప్పు తెలుసుకుని సారీ చెప్పారు. "క్షమించాలి. నేను చెప్పేది కెనడా గురించి. చైనా గురించి కాదు. చైనా విషయంలో నేనేం ఆలోచిస్తూ ఉంటానో మీకు తెలిసే ఉంటుంది." అంటూ తన వ్యాఖ్యల్ని సరి చేసుకున్నారు. కెనడా పార్లమెంట్ సభ్యులు ఇది విని గట్టిగా నవ్వారు. ఆ తరవాత బైడెన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 


Also Read: Manipur Violence: మణిపూర్‌లో ఆగని అల్లర్లు, కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి