Manipur Violence: 


ఆర్‌కే రంజ్ సింగ్ ఇల్లు ధ్వంసం..


మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఏకంగా కేంద్రమంత్రి ఇంటిపైనే దాడి చేసే స్థాయికి ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఒకేసారి వెయ్యి మంది నిరసనకారులు కేంద్రమంత్రి ఆర్‌కే రంజన్ సింగ్‌ ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. ఇంఫాల్‌లోని ఆయన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి జరిగిన సమయంలో  మంత్రి ఇంట్లో లేరు. ఇంఫాల్‌లో ఇప్పటికే కర్ఫ్యూ విధించినా... ఆందోళనకారులు లెక్క చేయకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. నేరుగా మంత్రి ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ 9 మంది భద్రతా సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డ్‌లు, 8 మంది స్పెషల్ గార్డ్‌లు ఉన్నారు. ఒకేసారి వెయ్యి మంది దాడి చేయడం వల్ల భద్రతా సిబ్బంది ఏమీ చేయలేకపోయింది. దాడుల్లో భాగంగా పెట్రోల్ బాంబులు విసిరినట్టు సెక్యూరిటీ గార్డ్‌లు వెల్లడించారు. 


"అంత మంది వచ్చే సరికి మాకేం చేయాలే అర్థం కాలేదు. వాళ్లను ఏ మాత్రం అడ్డుకోలేకపోయాం. అన్ని వైపుల నుంచి పెట్రోల్ బాంబులు విసిరారు. ఎంట్రెన్స్ గేట్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. ఏమీ చేయలేక అలానే ఉండిపోయాం. దాదాపు 12 వందల మంది దాడి చేసి ఉంటారు. "


- భద్రతా సిబ్బంది










తరచూ దాడులు..


ఈ కేంద్రమంత్రి ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది మే నెలలోనూ దాడి చేస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపింది. అప్పుడు ఆందోళనకారుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల వెంటనే పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కానీ ఈ సారి పెద్ద ఎత్తున రావడం వల్ల సెక్యూరిటీ గార్డ్‌లు ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా...రంజన్ సింగ్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గత నెల రంజన్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు.