ఏంటి కాస్త సన్నగా కనిపిస్తున్నావ్ అంటే వాళ్ళు చెప్పే మాట బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నామని. అయితే చాలా మంది ర్యాపిడ్ వెయిట్ లాస్ మీద ఎక్కువ శ్రద్ద వహిస్తున్నారు. అనేక ప్రకటనలు, మార్కెటర్స్ కూడా ర్యాపిడ్ వెయిట్ లాస్ గురించి విపరీతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఫ్యాడ్ డైట్, ట్యాబ్లెట్స్, ఆకలిని అణుచుకోవడం, అనేక ఇతర పద్ధతుల ద్వారా ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ చేయిస్తున్నారు. అయితే ఈ చిట్కాలు నిజంగానే పని చేస్తాయా? అంటే స్పష్టమైన సమాధానం లేదు. ఈ పద్ధతి తక్షణ ఫలితాలు అందించవచ్చు కానీ దీర్ఘకాలంలో శరీరాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అసలు వేగంగా బరువు తగ్గడం అంటే ఏంటి?


ఒక వ్యక్తి ఒక కేజీ బరువుని వారం లేదా అంతకంటే ఎక్కువ రోజుల్లో తగ్గిపోతే దాన్ని వేగంగా బరువు తగ్గడం అంటారు. చాలా తక్కువ కేలరీల ఆహారం, మాస్టర్స్ క్లీన్స్ రొటీన్, ఫుడ్ సప్లిమెంట్ తో సహా అనేక విధాలు వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఈ పద్ధతులు ఎక్కువ పని లేకుండానే వేగవంతమైన ఫలితాలను ఇస్తాయి. కానీ దీర్ఘకాలంలో దాని ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామ దినచర్య ఇచ్చే లాభాలని ర్యాపిడ్ వెయిట్ లాస్ ప్రక్రియ ఇవ్వలేదు. ఈ విధంగా బరువు తగ్గిన వాళ్ళలో హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల అనార్థాలు


పోషకాహార లోపాలు: వేగంగా బరువు తగ్గించే వ్యూహాలు సాధారణంగా చాలా తక్కువగా తినడం లేదా తక్కువ కేలరీల ఆహారాలు తీసుకుంటారి. దీని వల్ల శరీరానికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు అందవు. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. చివరికి ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.


పిత్తాశయంలో రాళ్ళు: ఈ పరిస్థితి 12 నుంచి 25 శాతం మందిలో కనిపిస్తుంది. తక్కువ సమయంలో అధిక మొత్తంలో బరువు కోల్పోవడం జరుగుతుంది. దీని వల్ల పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి. మరిన్ని వైద్యపరమైన సమస్యలను కలిగిస్తాయి.


కండరాల నష్టం: కేలరీలు చాలా త్వరగా తగ్గించినట్లయితే కొవ్వు తగ్గించుకోవడం మాట అటుంచితే కండరాల నష్టం వాటిల్లితుంది. కండరాలు బలహీనపడిపోతాయి.  ఇది మంచిది కాదు. ఎందుకంటే కండరాలు ఆరోగ్యకరమైన శరీరానికి అవసరం. మంచి టోన్డ్ లుక్ ని అందించలేవు.


రుతుక్రమంలో లోపాలు: వేగంగా బరువు తగ్గడం వల్ల హార్మోన్ల అసమతుల్యతకి కారణమవుతుంది. ఎక్కువగా స్త్రీల విషయంలో ఇది ఎదురవుతుంది. దీని వల్ల రుతుచక్రంలో అంతరాయాలు ఏర్పడతాయి.


డీహైడ్రేషన్: ర్యాపిడ్ వెయిట్ లాస్ ప్రోత్సహించే ఆహారాలు, వ్యాయామాలు తరచుగా తీవ్రమైన నిర్జలీకరణానికి దారి తీస్తాయి. అలసట, మైకం, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు కలిగిస్తాయి.


ఈటింగ్ డిజార్డర్:  చాలా త్వరగా బరువు తగ్గడం వల్ల అనోరెక్సియా లేదా బులీమియా వంటి ఈటింగ్ డిజార్డర్ అభివృద్ధి చేయవచ్చు. ఇవి శరీరం, మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి.


మానసిక కల్లోలం: వేగంగా బరువు తగ్గడం వల్ల శరీరం మాత్రమే కాదు మనసు కూడా ప్రభావితం అవుతుంది. నిరాశ, డిస్మోరియా వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి.


అందుకే వైద్య నిపుణులు సలహాలు తప్ప ఎట్టి పరిస్థితుల్లోను ఇటువంటి వాటికి మొగ్గు చూపకూడదు. బరువు తగ్గడం మంచి ఆలోచనే కానీ అది ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ తగ్గితే మెరుగైన ఫలితాలు పొందుతారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: జాగ్రత్త! జిమ్ వల్ల ఆరోగ్యమే కాదు అంటువ్యాధులు వస్తాయ్