Big Beautiful Bill passed in us | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన కోరుకున్నట్లుగానే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభించింది. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 218-214 ఓట్ల తేడాతో గురువారం అర్ధరాత్రి ఆమోదించారు. దీనిని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు.
ఇటీవల అమెరికా సెనెట్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందడం తెలిసిందే. తాజాగా ప్రతినిధుల సభలోనూ బిల్లు పాస్ కావడంతో ఇది చట్టంగా మారుతుంది. ట్రంప్ పదవీకాలంలో ఈ బిల్లును చట్టంగా మార్చుకోవడాన్ని ముఖ్యమైన విజయంగా పరిగణిస్తారు. ఇరు సభలు ఆమోదం తెలిపిన బిల్లుపై త్వరలోనే అధ్యక్షుడు సంతకం చేయనున్నారు. ఈ బిల్లు విషయంలోనే ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. మా దేశం వదిలి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపో అని సైతం ట్రంప్ వ్యాఖ్యలు చేయడం విశేషం.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందిన తర్వాత వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ బిల్లుపై స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భారీ పన్ను మినహాయింపు, వ్యయ తగ్గింపు బిల్లుపై సంతకం చేయనున్నారని తెలిపారు. జూలై 4న సంతకం తరువాత కార్యక్రమం ఉంటుందన్నారు. దాదాపు 800 పేజీలకు పైగా ఉన్న ఈ బిల్లును ఆమోదింపజేయడానికి డొనాల్డ్ ట్రంప్ చాలా కష్టపడ్డారని తెలిపారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అంటే ఏమిటి
అమెరికాలో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కీలకంగా మారనుంది. దీని ద్వారా దేశంలో ఆర్థిక సంస్కరణలకు ట్రంప్ శ్రీకారం చుట్టనున్నారు. 2017లో ఎత్తివేసిన పన్ను కోతలను శాశ్వతంగా కొనసాగించడానికి ప్రధాన వ్యయ బిల్లును ట్రంప్ తీసుకువచ్చారు. దాదాపు 4.5 ట్రిలియన్ డాలర్ల పన్నుల కోత ప్రస్తావించారు. సీనియర్ సిటిజన్లు కూడా 6000 డాలర్ల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. పిల్లల పన్ను క్రెడిట్‌ను కూడా 2200 డాలర్లకు పెంచవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సరిహద్దు భద్రత కోసం 350 బిలియన్ డాలర్లు ఖర్చు చేయవచ్చు.
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఏముంది..
ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం సబ్సిడీలలో, ఖర్చులలో, పన్ను మినహాయింపులలో కోత విధించడం. అదే సమయలో దీన్ని వైద్య రంగంలో కొన్ని సబ్సిడీల తగ్గింపు అని నమ్ముతారు. రుణ పరిమితిని కూడా 5 ట్రిలియన్ డాలర్లకు పెంచవచ్చు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కారణంగా పన్ను కోతలు, సైనిక వ్యయం, సరిహద్దు భద్రత మరింత బలోపేతం కావానికి అవకాశం ఉంది.
బిల్లు ప్రకారం దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణ సబ్సిడీని సైతం రద్దు చేస్తారు. అమెరికాలోని నిరుపేదలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. మెడికేడ్, అఫోర్డబుల్ కేర్ యాక్ట్‌లో ప్రతిపాదనల కారణంగా 2034 నాటికి దాదాపు 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాను కోల్పోయే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.