US Girl: ఆ కుటుంబానికి ఒక్కగానొక్క బిడ్డ. పట్టుమని చిన్నారి వయసు 10 ఏళ్లు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అంతలోనే విధి వెక్కిచించింది. లుకేమియా రూపంలో మృత్యువు కబలిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలో కళ్ల ముందే కూతురు చనిపోతుందని తెలిసి ఆ తల్లిదండ్రులు పడిన నరకం అంతా ఇంతా కాదు. తమ బిడ్డను కాపాడుకోవడానికి వారు చేయని ప్రయత్నం లేదు. అప్పటికే పరిస్థితి విషమించింది. వైద్యులు సైతం చేతులు ఎత్తేశారు. 


కళ్లెదుటే కూతురు మృత్యువుకు చేరువవుతుంటే ఏం చేయాలో పరిస్థితి ఆ తల్లిదండ్రులది. అంత కష్టంలోనూ తమ బిడ్డ ఆఖరి కోరికను నెరేవర్చారు. చివరి క్షణాల్లో తమ బిడ్డ కళ్లలో ఆనందం నింపారు. బాలిక స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసి తన చివరి కోరిక తీర్చారు. ఆ పెళ్లి జరిగిన 12 రోజులకే చిన్నారి పరిస్థితి విషమించి కన్నుమూసింది. హృదాయన్ని పిండేసే విషాద ఘటన అమెరికాలో జరిగింది.  


వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కరోలినాలోని అలీనా(39), ఆరోన్‌ ఎడ్వర్డ్స్‌ (41)ల దంపతులకు ఎమ్మా ఎడ్వర్డ్స్‌ (10) అనే కుమార్తె ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఆ చిన్నారి అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండె బద్దలయ్యే విషయాన్ని తెలిపారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఎమ్మా ఎడ్వర్డ్స్ ప్రాణాంతకమైన క్యాన్సర్‌కు (అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా) గురైనట్లు డాక్టర్లు చెప్పారు. పిడుగులాంటి ఈ వార్త విన్న ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా కాళ్లకింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. 


ఈ విషయం తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలని, ఆమె ప్రాణాలు దక్కాలని ఆస్పత్రుల చుట్టూ తిరిగారు.  గొప్ప గొప్ప డాక్టర్లను కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. ఎక్కడికి వెళ్లినా బాలిక ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని,  ఆమె మృత్యు ఒడిలోకి చేరుకోబోతోందని చెప్పేశారు. 


వ్యాధి ముదిరిపోయిందని, చిన్నారి జీవితంలో ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో, తమ కుమార్తెను చివరి రోజుల్లో సంతోషంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ నాకు పెళ్లి కావాలంటూ అంటూ ముద్దు ముద్దుగా పలికే ఎమ్మా ఎడ్వర్డ్ మాటలను నిజం చేయాలనుకున్నారు. వెంటనే కుమార్తె స్నేహితుడి తల్లిదండ్రులతో మాట్లాడి విషయం చెప్పారు. దీంతో వారు వారు పెళ్లికి అంగీకరించారు.


ఈ సమయంలో స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఎడ్వర్డ్స్ కుటుంబానికి అండగా నిలిచి తమవంతు సాయం చేశారు. జూన్‌ 29న పెద్దఎత్తున బంధుమిత్రుల సమక్షంలో ఎమ్మాకు.. తన స్నేహితుడు డేనియల్ మార్షల్ క్రిస్టోఫర్ విలియమ్స్ జూనియర్‌తో నమూనా వివాహాన్ని ఘనంగా రెండు రోజుల పాటు జరిపించారు. ఈ పెళ్లి జరిగిన 12 రోజులకే ఎమ్మా జులై 11న ఆ చిన్నారి కన్ను మూసింది. 


బాలిక తల్లి అలీనా మాట్లాడుతూ.. సాధారణంగా చాలా మంది పిల్లలకు డిస్నీల్యాండ్‌ వెళ్లాలని, ఏవైనా బొమ్మలు కొనాలనే కోరిక ఉంటుందని. కానీ, తన కుమార్తె మాత్రం పెళ్లి చేసుకుంటానని మారాం చేసేది కన్నీటితో చెప్పింది. చివరి క్షణాల్లో తన కుమార్తె కోరికను నెరవేర్చేలా పెళ్లితంతును జరిపించామని దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పుకొచ్చింది. తమ కుమార్తె సీతాకోకచిలుక లాంటిదని అందుకే ఆమె కోరికను నెరవేర్చేలా మాక్‌ వెడ్డింగ్ జరిపించామని తెలిపింది.