US Storms: అమెరికాను భీకర గాలులు కుదిపేస్తున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. భీకరంగా వీస్తున్న గాలులు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్లు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. న్యూయార్క్ నుంచి టెనసీ వరకు 10 రాష్ట్రాల్లో కల్లోల వాతావరణ పరిస్థితులు కుదిపేస్తున్నాయి. జాతీయ వాతావరణ సేవల విభాగం అంచనా ప్రకారం టోర్నడోల ప్రభావం 3 కోట్ల మందిపై పడినట్లు అంచనా. భీకర గాలులకు చెట్లు విరిగి పడుతున్నాయి. పలు చోట్ల పిడుగులు పడుతున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడ్డ ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 2600 లకు పైగా విమానాలు రద్దు అయ్యాయి. 11 లక్షల ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 


అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లో ప్రభుత్వ ఆఫీసులతో పాటు ఇతర సేవలు మూసివేయాల్సి వచ్చింది. తీరప్రాంతాల్లో వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా, బాల్టిమోర్ లలోని విమానాశ్రయాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ ఫ్లైట్ అవేర్ ప్రకారం.. 2,600 కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 7,900 విమానాలు ఆలస్యంగా నడిచినట్లు ఫ్లైట్ అవేర్ తెలిపింది. హార్ట్ ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక విమానాలు రద్దయ్యాయి. అలాగే తూర్పు అమెరికా వైపు వెళ్లే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. మేరీ ల్యాండ్, అలబామా, జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినాలు, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా తదితర ప్రాంతాల్లో 11 లక్షల ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయినట్లు తెలుస్తోంది. 


ఇద్దరు మృతి, 3 కోట్ల మందిపై ప్రభావం


టెనస్సీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాల్లో సుడిగాలి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం 29.5 మిలియన్లకు పైగా ప్రజలు సుడిగాలి ప్రభావిత ప్రాంతంలో ఉన్నట్లు వెదర్ సర్వీస్ తెలిపింది. సౌత్ కరోలినాలోని అండర్సన్ లో భీకర గాలుల వల్ల ఓ చెట్టు విరిగి కారు దిగుతున్న 15 ఏళ్ల బాలుడిపై పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అలాగే అలబామాలోని ఫ్లోరెన్స్ లో పిడుగుపాటుకు గురై 28 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు.


Also Read: Tomato Price Drop: దిగొస్తున్న టమాటా ధర - భారీగా తగ్గుదల, హైదరాబాద్‌లో ఎంతంటే?


పలు కార్యక్రమాలు రద్దు చేసిన వైట్ హౌజ్


అన్ని ఫెడరల్ కార్యాలయాలను మూసివేశారు. అత్యవసర ఉద్యోగులు అందరూ మధ్యాహ్నం 3 గంటలలోపు ఇంటికి బయల్దేరాల్సిందిగా పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయం ప్రకటించింది. అలాగే అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బిడెన్, విద్యా కార్యదర్శి, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ, పాఠశాలల నిర్వాహకులు, అధ్యాపకులు పాల్గొనే బ్యాక్-టు-స్కూల్ సైబర్ సెక్యూరిటీ ఈవెంట్ ను వైట్ హౌజ్ రద్దు చేసింది. ఫిలడెల్ఫియాలోని ఫిల్లీస్, వాషింగ్టన్ నేషనల్స్ మధ్య జరగాల్సిన మేజర్ లీగ్ బేస్‌బాల్‌ గేమ్ భీకర తుపాను కారణంగా వాయిదా పడింది. మేరీ ల్యాండ్ లో తక్కువ సమయంలోనే 10.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నేషనల్ వెదర్ సర్వీస్ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికను జారీ చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.