US banks:
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా! భూతల స్వర్గమని పేరు! డబ్బు, పెట్టుబడులకు కొదవే ఉండదన్న భరోసా! అలాంటిది అమెరికా ఎకానమీ క్రమంగా సంక్షోభంలోకి జారుకుంటోంది. పరిస్థితి మెరుగుపడకపోతే క్రమంగా రేటింగులు తగ్గిస్తామని రేటింగ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నీమధ్యే యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను AAA నుంచి AA+కు తగ్గిస్తూ ఫిచ్ రేటింగ్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ దేశంలోని అనేక బ్యాంకులకు మూడీస్ క్రెడిట్ రేటింగ్ తగ్గించి షాకిచ్చింది.
అమెరికా బ్యాంకులను మూడీస్ హెచ్చరించింది. ఒకేసారి పది బ్యాంకుల క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించింది. మరికొన్ని బ్యాంకుల పనితీరును సమీక్షిస్తున్నామని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. బహుశా తగ్గించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సూచిస్తోంది. చాలా బ్యాంకుల భవిష్యత్‌ను నెగెటివ్ కిందకు మార్చింది. మొత్తం 27 బ్యాంకుల రేటింగ్‌ను మార్చేసింది.
రేటింగ్ తగ్గించిన జాబితాలో ఎంటీ బ్యాంకు, పినాకిల్ ఫైనాన్షియల్ పాట్నర్స్, ప్రాస్పరిటీ బ్యాంకు, బీఓకే ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉన్నాయి. బీఎన్‌వై మెలన్, యూఎస్ బాన్‌కార్ప్, స్టేట్ స్ట్రీట్ అండ్ ట్రూయిస్ట్ ఫైనాన్షియల్ బ్యాంకుల రేటింగ్‌ను తగ్గించేందుకు సమీక్షిస్తోంది.
'చాలా బ్యాంకుల రెండో త్రైమాసికం ఫలితాలను పరిశీలిస్తే లాభదాయకత పెంచుకోవాలన్న ఒత్తిడి కనిపిస్తోంది. దాంతో అంతర్గత పెట్టుబడిని సృష్టించే సామర్థ్యం తగ్గిపోతోంది. ఇది ఆర్థిక మాంద్యం భయాలను సూచిస్తోంది' అని మూడీస్ రేటింగ్ తెలిపింది. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు యూఎస్ ఫెడ్ వరుసగా వడ్డీరేట్లు పెంచడమూ బ్యాంకులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. దాంతో ఆస్తులు, అప్పుల నిర్వహనలో విఫలమవుతున్నాయని వివరించింది.
ఈ ఏడాది ఆరంభంలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం అమెరికా బ్యాంకులపై విశ్వాసాన్ని దెబ్బతీసింది. దాంతో డిపాజిటర్ల తమ డబ్బుల కోసం పరుగెత్తారు. అతిపెద్ద బ్యాంకులు రంగంలోకి దిగి వీటిని విలీనం చేసుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.
ఇక క్యాపిటల్ వన్, సిటిజన్స్ ఫైనాన్షియల్, ఫిఫ్త్ థర్డ్ బ్యాన్‌కార్ప్ కంపెనీల ఔట్‌లుక్‌ను మూడీస్ స్థిరత్వం నుంచి ప్రతికూలతకు మార్చేసింది. పీఎన్‌సీ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్, సిటిజెన్స్, హింటింగ్‌టన్ బ్యాంక్‌షేర్స్ వంటి రేటింగ్‌ను ధ్రువీకరించింది.
వారం రోజుల క్రితమే అమెరికా ఎకానమీకి ఫిచ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను AAA నుంచి AA+ కు సవరించింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా అపనమ్మకం, ఆందోళన మొదలయ్యాయి. రాబోయే మూడేళ్లలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని ఫిచ్ అంచనా వేయడం కలకలం రేపుతోంది.
ఫిచ్ రేటింగ్ (Fitch Rating) సంస్థ అమెరికా రేటింగ్‌ను (US Credit Rating) తగ్గించడం 2011లో ప్రభుత్వ అప్పుల పరిమితి నేపథ్యంలో స్టాండర్డ్ అండ్ పూర్ (S&P) చర్యను తలపించింది. అనిశ్చితి వల్ల అప్పుడు యూఎస్ ట్రెజరీ రుణాల ఖర్చు 1.3 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ప్రస్తుత పరిస్థితీ అలాగే కనిపిస్తోంది. రేటింగ్ తగ్గించడం వల్ల అమెరికా అప్పుల భారం మరింత పెరగనుంది. రుణాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏదేమైనా రేటింగ్‌ను డౌన్ గ్రేడ్ చేయడం ఆర్థిక నిపుణులను ఆశ్చర్యపరిచింది.