Russia Ukraine Conflict: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వేళ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగా’ (Operation Ganga) వేగం పుంజుకుంది. స్వయంగా కేంద్ర మంత్రులే భారతీయులను ఉక్రెయిన్ (Ukraine Crisis) నుంచి తరలించడంలో పాలుపంచుకుంటున్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లి భారతీయులను తరలిస్తున్న విధుల్లో పాల్గొంటున్నారు. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ విజయ్ కుమార్ సింగ్ (Vijay Kumar Singh) భారతీయుల తరలింపులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పోలాండ్ (Poland) నుంచి భారతీయులను తరలిస్తుండగా వారితో కలిసి ప్రత్యక్షంగా ఉండి సాయం అందించారు. ఈ మేరకు పోలాండ్‌లో తాను ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయులతో ఉన్న వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
వరుసగా ట్వీట్లు చేసిన ఈ వీడియోల్లో, పోలాండ్‌లోని భారత రాయబారి నగ్మా మల్లిక్‌తో కలిసి పోలాండ్ - ఉక్రెయిన్ సరిహద్దులోని (Poland - Ukraine Border) బుడోమియర్జ్ అనే ప్రాంతంలోని భారతీయ విద్యార్థులతో కొంత సేపు గడిపారు. వారికి మంచి నీళ్ల బాటిళ్లు, ఆహారం అందించారు. ‘‘ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులకు మనోబలం చాలా ఎక్కువగా ఉంది. వారి మానసిక దృఢత్వానికి నేను ముగ్ధుడిని అయ్యాను. జై హింద్!’’ అంటూ కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ (Union Minister VK Singh) ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌కు తరలించే డ్రైవ్ అయిన ‘ఆపరేషన్ గంగా’ (Operation Ganga) గత శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రారంభం అయింది. ఆ తరలింపు డ్రైవ్‌లో భాగంగా ఇప్పటిదాకా మొత్తం 3,352 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానంలో 208 మంది భారతీయులను స్వదేశానికి తరలించే సన్నాహాలను జనరల్ సింగ్ వ్యక్తిగతంగా సమీక్షించారు. విద్యార్థులు అక్కడి నుంచి విమానంలో బయలుదేరే ముందు, తర్వాతి రౌండ్ తరలింపులను మంత్రి అక్కడే ఉండి స్వయంగా సమన్వయం చేస్తున్నారు. స్వయంగా విమానంలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.