UN Report On Global Warming: సమప్త ప్రాణకోటికి జీవనాధారమైన భూ గ్రహం (Earth) వేగంగా వేడెక్కుతోంది. భూతాపం (Global Warming) ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి (United Nations) నివేదిక పేర్కొంది. మానవ అనుచిత ప్రవర్తన వాతావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోందని, పర్యావరణ క్రియాశీలతలో పెనుమార్పులు తీసుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. పారిశ్రామికీకరణ (Industrialization)కు ముందు నాటితో పోలిస్తే అది 2.5 నుంచి 2.9 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగే దిశగా పయనిస్తోందని వివరించింది. అదే జరిగితే భూ ప్రపంచం మనుగడకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.


పారిస్ ఒప్పందం
పారిశ్రామిక విప్లవానికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ప్రపంచంలో సగటున 1.15 డిగ్రీల సెల్సి­యస్‌ మేర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని ప్రపంచ దేశాలు ‘పారిస్‌ ఒప్పందం’ (Paris Pledges)లో తీర్మానించాయి. ఇందుకు అనుగుణంగా ఈ దశాబ్దం చివరి నాటికి తమ కర్బన ఉద్గారాలను 42 శాతం మేర కుదించుకోవడానికి దేశాలు అంగీకరించాయి. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం వేయలేకపోయాయి. బొగ్గు, చమురు, గ్యాస్‌ వినియోగంతో గత ఏడాది గ్రీన్‌హౌస్‌ వాయువులు (Green House Gases) 1.2 శాతం మేర పెరిగాయని తాజా నివేదిక పేర్కొంది. 


సముద్ర మట్టాలు పెరిగే అవకాశం
ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబరు చివరి నాటికి ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటేసిన సందర్భాలు 86 ఉన్నాయని వివరించింది. అక్టోబరు, నవంబరులో మొదటి రెండు వారాల్లో ప్రతి రోజూ ఇదే పరిస్థితి నెలకొందని ఐక్యరాజ్య సమితి నివేదిక వివరించింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 40 శాతం రోజుల్లో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల తీవ్ర స్థాయికి చేరిందని తెలిపింది. శుక్రవారం అది 2 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని పేర్కొంది. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయలని లేకపోతే  సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  


ఉద్గారాలు తగ్గించకపోతే ప్రమాదమే
భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయలలనే లక్ష్యాన్ని.. అనేక సంవత్సరాల లెక్కల ఆధారంగా నిర్దేశించారని శాస్త్రవేత్తలు తెలిపారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా  ఆ పరిమితిని 2029లోనే చేరుకోవచ్చని అంతకుముందు అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. భూతాపాన్ని నివారించడానికి కర్బన ఉద్గారాలను తగ్గించాలని, ప్రపంచ దేశాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.  1.5 డిగ్రీ సెల్సియస్‌ కంటే పెరగకుండా కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్‌ వంటి తీర ప్రాంత దేశాలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.


వాతావరణంలో అనూహ్య మార్పులు
మునుపటి శతాబ్దాల కంటే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగు­తున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే 2 వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. 2 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదలతో సముద్రాలు 6 మీటర్లు, 5 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదలతో సముద్రాలు 22 మీటర్లు వరకు పెరగవచ్చు. లోతట్టు ప్రాంతాలు, మొత్తం దేశాలు జలసమాధి అవుతాయి. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది.  


ప్రధాన నగరాలు జలమట్టం
కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా,  ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్‌ ఏంజిలిస్, న్యూయార్క్, బ్యూనస్‌ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది.  ఈ పరిస్థితులను నియంత్రించడానికి గ్రీన్‌హౌస్‌ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.