YouTube bans ads on RT and other Russian channels: ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో యుద్ధానికి దిగిన రష్యాపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. అమెరికా, భారత్ లాంటి దేశాలు యుద్ధం సరైన నిర్ణయం కాదని ఇరుదేశాలకు సూచించాయి. కొన్ని దేశాలు రష్యాకు ఎగుమతి, దిగుమతులు నిషేధించాయి. సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ఇదివరకే రష్యా ప్రభుత్వ అధికారిక అకౌంట్లపై ఆంక్షలు విధించాయి. సోషల్ మీడియా నుంచి క్యాష్ చేసుకోకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. యూట్యూబ్ సైతం ఫేస్‌బుక్, ట్విట్టర్ బాటలో నడుస్తూ ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచింది.
రష్యా యూట్యూబ్ ఛానెళ్లపై ఆంక్షలు..
రష్యాకు చెందిన అధికారిక యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించాలని ఉక్రెయిన్ డిజిటల్ మినిస్టర్ మైఖెలో ఫెడోరోవ్ సంస్థను అభ్యర్థించారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామని, రష్యా ప్రభుత్వానికి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానెళ్లపై ఆంక్షలు అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడ కూడా రష్యా అధికారిక యూట్యూబ్ అకౌంట్లకు చెందిన యాడ్స్ నిషేధించింది. రష్యా అఫీషియల్ అకౌంట్స్‌లో మానిటైజేషన్ సైతం నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూట్యూబ్. ఈ నిర్ణయంతో అధికారిక యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా రష్యాకు ఎలాంటి నగదు చేతికి రాదు. ఉక్రెయిన్‌పై దాడులు లాంటి విషయాలు సైతం యూట్యూబ్‌లో ప్రసారం చేసినట్లు సంస్థ గుర్తించింది. అలాంటి వీడియోలను సైతం తాము డిలీట్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
రష్యాకు ఫేస్ బుక్, ట్విట్టర్ షాక్..
రష్యా ప్రభుత్వానికి చెందిన అధికారిక అకౌంట్లపై ఫేస్‌బుక్, ట్విట్టర్ నిఘా ఉంచాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా ఎంతకూ వెనక్కి తగ్గకపోవడం, సామాజిక మాధ్యమాలతో రష్యా ప్రభుత్వం చేస్తున్న పోస్టులను గమనించిన ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలు రష్యా స్టేట్ మీడియాకు చెందిన ఖాతాలపై కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాలకు తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి యాడ్స్ (ప్రకటనలు) రావని ఆ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఇదివరకు ఉన్న పోస్టులు, వీడియోల ద్వారా కొంతకాలం వరకు క్యాష్ చేసుకోకుండా ఆంక్షలు విధించారు.
ఒక వర్గాన్ని, మతాన్ని, సంస్థను కించపరచడం, తక్కువగా చేయడం లాంటి పోస్టులను గమనిస్తే స్పందించి చర్యలు తీసుకునే సంస్థల్లో ట్విట్టర్ ఒకటి. అలాంటిది ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న మారణహోమంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సైతం నిరాశ చెందింది. ఉక్రెయిన్‌కు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా.. దేశ పౌరులను రెచ్చగొట్టే విధంగా రష్యా చేసిన పోస్టులను డిలీట్ చేసే పనిలో బిజీగా ఉంది. రష్యాకు చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాలపై ఆంక్షలు విధించింది. మానిటైజేషన్ నిలిపివేయడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్ల నుంచి చేసే పోస్టులపై నిఘా ఉంచింది. కొందరు నేతలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించింది. ప్రజల రక్షణ, భద్రత లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తామని ట్విట్టర్ పేర్కొంది.
Also Read: Russia-Ukraine War: దూకుడుగా సాగుతోన్న రష్యా సేనలు- దక్షిణ ఉక్రెయిన్ నగరాలు హస్తగతం
Also Read: Russia Ukraine War: చేతిలో భారత జెండా, దేశభక్తి ఊపిరి నిండా- భారతీయులకు రక్షణ కవచంగా త్రివర్ణ పతాకం