ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమానికి శవాల గుట్టలే సాక్ష్యాలుగా నిలిచాయి. ఇప్పుడు అక్కడ ఏ వీధిలో చూసినా శవాల దిబ్బలే. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 30 కిమీ దూరంలో ఉన్న బుచా నగరంపై రష్యా విరుచుకుపడిన తీరుకు నిదర్శనంగా 410 మృత దేహాలు కనిపించాయి.
మారణహోమం
ఒకేచోట దాదాపు 300 మంది సాధారణ పౌరుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. వీటిల్లో ఓ పసిబిడ్డ మృతదేహం కూడా ఉంది. ఇది ఉద్దేశపూర్వక మారణకాండ అని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా పేర్కొన్నారు. వీధుల్లో దొరికిన చాలా మృతదేహాలను చూస్తే ప్రజల్ని నేలపై పడుకోబెట్టి, చేతుల్ని వెనక్కి కట్టి తలవెనక భాగాన కాల్చినట్లు తెలుస్తోందని మేయర్ అనతోలి ఫెడొరక్ చెప్పారు.
మృతుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలిపారు. సురక్షిత ప్రాంతానికి తరలిపోయే ప్రయత్నంలో ఉన్నవారినీ రష్యా సైనికులు పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి మార్చి 31న ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. ధ్వంసమైన రష్యా యుద్ధ ట్యాంకులతో అక్కడి వీధులు బీభత్సంగా కనిపిస్తున్నాయి.
సామూహిక అత్యాచారాలు
బుచాలో మహిళలపై రష్యా బలగాలు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డాయని, ఆపై వాళ్లను కట్టేసి నిప్పంటించి సజీవ దహనం చేశారని ఆరోపించారు. అంతేకాదు స్థానిక అధికారులు, పిల్లల మృతదేహాలు రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇంతటి మారణహోమానికి రష్యానే కారణమని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
మాకేం తెలీదు
ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా ఖండించింది. ఇదంతా కీవ్ నుంచి జరుగుతున్న కుట్రే అని పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బుచాలో శవాల ఫొటోలు, వీడియోలు రష్యాను రెచ్చగొట్టడానికి కీవ్ నుంచి వెలువడుతున్న సంకేతాలే అని పేర్కొంది. రష్యా బలగాలు అక్కడ ఉన్న టైంలో ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలేదని పేర్కొంది.