అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. శాక్రమెంటోలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






ఏం జరిగింది?


ఆ దేశ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దుండగులు కాల్పులు జరుపుతున్న శబ్దం వినిపిస్తుండగా.. అనేక మంది ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి.


కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. అయితే కాల్పులు ఎందుకు చేశారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.


గన్ కల్చర్


అమెరికాలో గన్ కల్చర్ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో తుపాకుల మోత వినిపిస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరి ప్రాణాలు పోతూనే ఉంటాయి.


అమెరికాలో నెలకు సగటున ప్రాణాలు కోల్పోయే వారిలో తుపాకి తూటాలకు బలైపోయేవారి సంఖ్యే అధికమని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీటిపై నియంత్రణ విధించాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నా ఫలితాలు శూన్యం.


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ గన్ కల్చర్‌ను ఆపలేమని తేల్చిచెప్పేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా వీటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే అక్రమంగా తుపాకులను తయారు చేసేవారిపై మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఎప్పటికప్పుడు అమెరికాలో కాల్పుల మోత వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ కాల్పుల ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Also Read: Sri Lanka PM Resigns: ఎట్టకేలకు ఆ దేశ ప్రధాని రాజీనామా- ప్రజా డిమాండ్‌కు తలొగ్గిన మహిందా!