శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సా తన పదవికీ రాజీనామా చేసినట్లు కొన్ని గంటల క్రితం వార్తలు వచ్చాయి. ఓ లేటర్ కూడా నెటింట్లో చక్కర్లు కొట్టింది. అధ్యక్షుడు గొటబయా రాజపక్సా రాజీనామాను ఇంకా ఆమోదించలేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రధాని రాజపక్సా రాజీనామా చేయలేదని ఆ దేశ పీఎంవో స్పష్టం చేసింది. ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. నిత్యవసరాల ధరలు మోత మోగుతున్నాయి. అంతేకాదు ఆసుపత్రుల్లో ఔషధాలు లేక, పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు రోజుకు 10 గంటల పాటు శ్రీలంక ప్రజలు పవర్ కట్ ఎదుర్కొంటున్నారు.


ధరల మోత


శ్రీలంక ప్రస్తుతం ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శ్రీలంకలో ప్రస్తుత ధరలు చూస్తే కళ్లు పైర్లు కమ్ముతాయి. కోడి గుడ్డు రూ.35, లీటర్​ కొబ్బరి నూనె రూ.900, కిలో చికెన్​ రూ.1000, కిలో పాల పొడి రూ.1945.. ఇవి ప్రస్తుతం శ్రీలంకలో నిత్యవసర ధరల పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం డాలర్‌తో శ్రీలంక కరెన్సీ విలువ 270 రూపాయలకు చేరింది. ఫలితంగా నిత్యవసర వస్తువులతో పాటు ఇంధనం, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి.


ఎందుకు?


ఆర్థిక మాంద్యం, శ్రీలంక కరెన్సీ క్షీణత వల్ల దేశంలో ధరల పెరుగుదల సంభవించింది. ఒకవేళ ధర చెల్లించి కొనుక్కుందామన్నా కొన్ని చోట్ల సరుకులు దొరకని పరిస్థితి నెలకొంది. చాలామంది షాపులు, సూపర్ మార్కెట్ల ముందు బారులు తీరి, చివరకు సరుకులు అయిపోయి ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు. నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు మాత్రమే పరిమితంగా ప్రజల్ని అనుమతిస్తున్నారు.


ఎట్టకేలకు


1970లో సంభవించిన కరవు కంటే దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటోంది. దేశంలో డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు శ్రీలంక తీసుకున్న సరళమైన విదేశీ మారక రేటు విధానమే, ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ధరల పెరుగుదలకు ప్రభుత్వ వైఫల్యాలే కారణమంటున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 



Also Read: Hottest March India: ఆ నెల చాలా హాట్ గురూ! 122 ఏళ్ల రికార్డ్ బద్దలు


Also Read: Pakistan No Trust Vote: చివరి బంతికి ఇమ్రాన్ ఖాన్ సిక్సర్- జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సై