Russia Ukraine Crisis: ఉక్రెయిన్ కు అత్యంత కీలకమైన, గుండెకాయ లాంటి డ్యామ్ ను పేల్చేశారు. మంగళవారం తెల్లవారుజామున నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్ ను పేల్చేయడంతో వరద నీరు ముంచుకు రావడం మొదలైంది. సౌత్ ఉక్రెయిన్ లోని ఖెర్సాన్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డ్యామ్ ఆ దేశానికి చాలా కీలకం. గత కొన్ని నెలలుగా ఈ డ్యామ్ సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. ఈ డ్యామ్ పైనా దాడులు జరుగుతాయని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఉక్రెయిన్ కు కీలకమైన ఈ డ్యామ్ పై దాడి జరిగింది. సౌత్ ఉక్రెయిన్ మిలటరీ కమాండ్ ఈ ఘటనకు రష్యానే కారణమని మాస్కో దళాలే డ్యామ్ ను పేల్చేశాయని ఆరోపించారు. రష్యా అధికారులు మాత్రం ఇది ఉగ్రదాడి అని చెబుతున్నారు.
అర్ధరాత్రి 2 గంటల నుంచి కఖోవ్కా డ్యామ్ పై వరుసగా దాడులు జరిగాయి. ఈ దాడులకు డ్యామ్ గేట్ వాల్వులు దెబ్బతిన్నాయి. దాని వల్ల నీళ్లు లీకయ్యాయి. కొద్దిసేపటికే నియంత్రించలేని విధంగా నీరు కిందకు రావడం మొదలైంది. ఖెర్సాన్ లో లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.
'ఇదో పర్యావరణ విధ్వంసం'
ఈ డ్యామ్ పేల్చివేతతో స్థానికంగా ఉన్న ప్రజలు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని రష్యా అధికారిక మీడియా పేర్కొంది. మరోవైపు నీపర్ నదికి తూర్పు తీరాన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే ఖాళీ చేయాలని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, అత్యవసరమైన పత్రాలు, నిత్యావసరాలు తీసుకుని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. మైఖోలావిక, ఓల్హిక, లివొ, టియాంగికా, పోనియాటివ్కా, ఇవానివ్కా, టోకరివ్కా వంటి గ్రామాలను ఖాళీ చేయాలని సూచించారు. డ్యామ్ పేల్చివేతను ఉక్రెయిన్ పర్యావరణ విధ్వంసంగా అభివర్ణించింది. డ్యామ్ పేల్చివేత తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. దీనిలో నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
'కఖోవా జలవిద్యుత్తు కేంద్రంలో భాగంగా డ్యామ్ నిర్మాణం'
ఈ డ్యామ్ ఎత్తు 30 మీటర్లు. కొన్ని వందల మీటర్ల పొడవు ఉంటుంది. 1956లో కఖోవ్కా జల విద్యుత్ కేంద్రంలో భాగంగా ఈ డ్యామ్ ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ లో 18 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇది గ్రేట్ సాల్ట్ లేక్ లోని నీటికి సమాన పరిమాణంలో ఈ రిజర్వాయర్ లో నీటిని నిల్వ చేయవచ్చు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యాక రష్యా దళాలు ఈ డ్యామ్ ను స్వాధీన పరచుకున్నాయి. ఆ తర్వాత ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. అప్పటి నుంచి ఈ డ్యామ్ రక్షణపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నేరుగా డ్యామ్ పైనే దాడులు చేశారు. ఈ డ్యామ్ పేల్చివేతతో ఉక్రెయిన్ లో కరెంట్ కష్టాలు, నీటి కష్టాలు పెరగనున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ కు అణు విద్యుత్ ను ఇచ్చే జపొరిజియా రష్యా స్వాధీనంలోకి వెళ్లిపోయింది.