ఎంత సంపద ఉన్నా కొంత మందికి దొంగతనం చేయడం అనేది హాబీ. చివరికి చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి దొంకతనం చేస్తే వారికి వచ్చే మానసిక సంతోషం అంతా ఇంతా కాదు.ఇలాంటి వారు అక్కడా ఇక్కడా చాలా చోట్ల ఉన్నారు. యూకేలోనూ ఉన్నారు. యూకేలోని ఆక్స్ ఫర్డ్ ప్రాంతంలోని లిటిల్‌మోర్ అనే కాలనీలో అక్కడి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే సైకిళ్లను దొంగతనం చేస్తున్నాడనే ఫిర్యాదులు రావడంతో ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసి ఇల్లు సోదాచేస్తే ఏమీ కనిపించలేదు. కానీ బ్యాక్‌యార్డ్‌లోకి వెళ్లే మాత్రం సైకిళ్ల గుట్ట కనిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపుగా ఐదువందలకుపైగా సైకిళ్లు అక్కడ ఉన్నాయి. అన్నీ దొంగతనం చేసినవే.
ఐదు వందల సైకిళ్లు అంటే మాటలా.. ఈ సైకిళ్ల గుట్ట గూగుల్ మ్యాప్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. శాటిలైట్ చిత్రాల్లో దొంగతనం చేస్తున్న పెద్ద మనిషి ఇంటి వెనుక సైకిళ్ల గుట్ట ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం కంటే అక్కడే ఉంచి..స్వాధీనం చేసుకున్నట్లుగా రాసుకున్నారు. ఇప్పుడా సైకిళ్లకు ఓనర్లు ఎవరు అని వెదకడం ప్రారభించారు. పోలీస్ కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఓనర్లు తమ సైకిళ్లు పోయాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయలేదు. అతని ఇంట్లో దొంగతనం చేసిన సొత్తు ఉందని .. ఫిర్యాదులు వచ్చినందునే సోదాలు చేశారు. దాంతో ఇవి దొరికాయి.
ఇప్పుడు ఆ వ్యక్తిని పోలీసులు సైకిళ్లు ఎందుకు దొంగతనం చేశారనే కోణంలోనే ప్రశ్నించారు. కానీ నమ్మద్గగ సమాధానాలు రాలేదు. నిజానికి ఆ వ్యక్తి సైకిళ్లను దొంగతనం చేశాడు కానీ... వాటిని అమ్మే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో వాడుకునే ప్రయత్నం చేయలేదు. వాటిని తీసుకొచ్చి అలా తన ఇంటి వెనుక పడేస్తూ ఉన్నాడు. అలా గుట్టలు గుట్టలు పోగేశాడు. విషయం బయటపడింది. కానీ ఎందుకు అలా చేశాడో మాత్రం చెప్పడం లేదు.
అయితే దొంగతనం చేయాలనిపించే జబ్బును కెప్టోమేనియా అంటారు. అలాంటి జబ్బు ఏమైనా ఆ యాభై నాలుగేళ్ల పెద్ద మనిషికి ఉందేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ వ్యక్తి ఆ కాలనీలో.. ఆ ఇంట్లో పదేళ్లకుపైగా ఉంటున్నారు కానీ ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరి దగ్గరా ఎలాంటి చోరీ చేశారన్న ఆరోపణలు లేవు.కానీ ఆ సైకిళ్లన్ని అక్కడ పడేయడం వల్ల ఎలుకలు.., ఇతర క్రిమికీటకాలు పెరిగి తమ ఇళ్లలోకి వస్తున్నాయన్న ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతానికి అతన్ని ప్రశ్నించి పంపేశారు.