Twitter Bonuses:
శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో పిటిషన్..
బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ట్విటర్‌పై ఉద్యోగులంతా చాలా అసహనంతో ఉన్నారు. హామీ ఇచ్చి వదిలేశారని మండి పడుతున్నారు. అంతే కాదు. కొందరు ఉద్యోగులు గ్రూప్‌గా ఏర్పడి ట్విటర్‌పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకూ సిద్ధమయ్యారు. 2022 ఏడాది బోనస్‌లు ఇవ్వడంలో కంపెనీ విఫలమైందని ఇప్పటికే ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశారు. ట్విటర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్..తమకు బోనస్ ఇస్తామని మాటిచ్చారని..కానీ ఒక్క పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ట్విటర్‌లో ఏటా బోనస్‌లు ఇస్తారు. అయితే...ఎలన్ మస్క్ గతేడాది అక్టోబర్‌లో ట్విటర్‌ని హస్తగతం చేసుకున్నారు. అప్పుడే పాలసీల్లో చాలా మార్పులు వచ్చాయి. ఫలితంగా..ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు బోనస్ కూడా వేయకపోవడం వల్ల వాళ్లంతా న్యాయ పోరాటానికి దిగారు. మస్క్ ట్విటర్‌ని కొనుగోలు చేసినప్పటి నుంచి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. అడ్వర్‌టైజింగ్ రెవెన్యూలో 50% కోత పడింది. చాలా బ్రాండ్‌లు ట్విటర్‌పై నమ్మకం కోల్పోయాయి. ఈ కారణంగా రెవెన్యూ పడిపోయింది. రెవెన్యూ లేనప్పుడు ఇంత మంది ఉద్యోగులు ఎందుకని లేఆఫ్‌లు ప్రకటించారు మస్క్. కొంత మంది రిజైన్ చేశారు. ఇలా దాదాపు 75% మేర వర్క్‌ఫోర్స్‌ని కోల్పోయింది ట్విటర్. ఇక టెక్నికల్ సమస్యలతోనూ సతమతమవుతోంది ఈ కంపెనీ. అయినా ఏటా ఇచ్చే బోనస్‌లు ఇస్తామని నెడ్ సెగాల్ హామీ ఇచ్చారని చెబుతున్నారు ఉద్యోగులు. కానీ ఆ ప్రామిస్‌ని బ్రేక్ చేసి మొండి చేయి చూపించారని మండి పడుతున్నారు. ప్రస్తుత ఉద్యోగులతో పాటు మాజీ ఉద్యోగులు కూడా పిటిషన్ వేశారు.
ఎన్నో మార్పులు..
ఎలాన్ మస్క్ చేతికి వచ్చాక ట్విట్టర్ వింత పోకడలకు వేదికగా మారింది. సిబ్బందిని తొలగించడం దగ్గర నుంచి, వెరిఫికేషన్‌కు డబ్బులు వసూలు చేయడం వరకు ఎన్నో మార్పులు జరిగాయి. ఇప్పుడు తాజాగా ట్విట్టర్‌లో మరో ఫీచర్‌ను కూడా తీసుకువచ్చారు ఎలాన్ మస్క్. ఇప్పుడు ట్విట్టర్‌లో రెండు గంటల వరకు నిడివి ఉన్న వీడియోలు అప్‌లోడ్ చేయవచ్చు. దీనిపై నెటిజన్ల నుంచి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ట్విట్టర్ ఇకపై పైరసీకి అడ్డాగా మారుతుందని, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు యూట్యూబ్‌కు పోటీగా తయారవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎలాన్ మస్క్ టేకోవర్ చేయకముందు ట్విట్టర్‌లో కేవలం రెండు నిమిషాల 20 సెకన్ల నిడివి వరకు మాత్రమే వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉండేది. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ వెరిఫికేషన్ తెచ్చాక దీన్ని మొదట 60 నిమిషాల వరకు పెంచారు. ఇప్పుడు ఏకంగా రెండు గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏ భాషకు సంబంధించిన సినిమా విడుదల అయినా దానికి సంబంధించిన క్లిప్స్ ట్విట్టర్‌లో తిరుగుతూ ఉంటాయి. ఈ ఫీచర్ పుణ్యమా అని ఇప్పుడు మొత్తం సినిమాను ట్విట్టర్‌లో పెట్టే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక నెటిజన్ అయితే మరో అడుగు ముందుకేసి ఇటీవలే రిలీజ్ అయిన ‘ఈవిల్ డెడ్ రైజ్’ సినిమా పైరసీ ప్రింట్‌ను ఇప్పటికే అప్‌లోడ్ చేశారు. కొంతమంది బాస్కెట్ బాల్, ఇతర క్రీడలకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
Also Read: International Yoga Day: నెహ్రూ ఫొటోతో యోగా డే విషెస్ చెప్పిన కాంగ్రెస్, ఆయనే పాపులర్ చేశారని ట్వీట్