International Yoga Day:
శీర్షాసనం వేసిన నెహ్రూ..
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఓ ట్వీట్ చేసింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శీర్షాసనం వేసిన ఫోటోని షేర్ చేస్తూ యోగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పింది. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న యోగను అందరూ గౌరవించాలని కోరింది. ఇదే సమయంలో నెహ్రూకి ధన్యవాదాలు తెలిపింది. యోగాను అప్పట్లోనే ఆయన ఎంతో పాపులర్ చేశారని తేల్చి చెప్పింది. నేషనల్ పాలసీలోనూ దాన్ని చేర్చారని గుర్తు చేసింది.
"అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని స్మరించుకుందాం. యోగాను పాపులర్ చేయడమే కాకుండా నేషనల్ పాలసీలో దాన్ని చేర్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నాం. వేల ఏళ్ల క్రితం నుంచి వస్తున్న ఈ జీవన విధానాన్ని ఈ సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకుందాం. మానసికంగా, శారీరకంగా మన ఆరోగ్యాన్ని కాపాడే యోగ ప్రాధాన్యతను గుర్తిద్దాం"
ఈ ఏడాది యోగ దినోత్సవాన్ని "యోగ ఫర్ వసుధైవ కుటుంబకం" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అందరినీ ఒక్కటి చేసే శక్తి యోగకి ఉందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ సారి అమెరికాలో ఈ వేడుకలు జరిగాయి. దాదాపు 180 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి హెడ్‌క్వార్టర్స్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. గతేడాది వరకూ ఈ ఉత్సవాలు భారత్‌కే పరిమితం అయ్యాయి. ఈసారి అవి అంతర్జాతీయ స్థాయిలో జరిగాయి. అయితే...అటు కాంగ్రెస్ ప్రధాని మోదీపై సెటైర్లు వేస్తూ ఓ ట్వీట్ చేసింది. మోదీ కారణంగానే యోగకి అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే "కెమెరా ఆసన్" అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. అయితే...నెహ్రూ యోగకి పాపులారిటీ తీసుకొచ్చారన్న ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.