Turkey Earthquake: టర్కీలో సోమవారం నుంచి ఆగకుండా భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. 7.8 తీవ్రతతో తరచుగా భూమి కంపించడంతో పెద్ద పెద్ద భవనాలు కూడా పేకముక్కలా కూలిపోతున్నాయి. ఈ విపత్తు కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. వందలాది ఇళ్లు, కుటుంబాలు ధ్వంసం అయ్యాయి. చెత్తాచెదారం ఎక్కడికక్కడే పడి ఉంది. భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో ఇప్పటి వరకు 5000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ భూకంపం తర్వాత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ దేశంలో 7 రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


టర్కీలో భూకంపం కారణంగా భారీ విధ్వంసం..


ఇప్పటికే సంభవించిన భూకంపం కారణంగా టర్కీ అంతా అతలాకుతలం కాగా... మళ్లీ భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదైంది. టర్కీలో ఇప్పటి వరకు 145 సార్లు భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనలు రోజులు లేదా వారాల పాటు కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ వరకు ప్రకంపనలు వచ్చినట్లు జియోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెన్మార్క్ తెలిపింది. ఒక సర్వే ప్రకారం... తీవ్రమైన భూకంపం కారణంగా 5600 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసమయ్యాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులు అయ్యాయి. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.


భూకంపం ఎందుకంత ప్రాణాంతకంగా మారింది?


కర్టిన్ యూనివర్శిటీ అధికారులు మాట్లాడుతూ... భూకంప ప్రధాన కేంద్రం దాదాపు 18 కిలో మీటర్లు (11 మైళ్ళు) లోతులో ఉందని అందుకే వినాశనాన్ని సృష్టించిందని చెబుతున్నారు. ఉపరితలానికి చాలా దగ్గరగా ఉండటం వల్లే భారీ విధ్వంసానికి కారణమైందని తెలిపారు. ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సీస్మోలజీ డైరెక్టర్ రెనాటో సాలిడమ్ ప్రకారం.. హిరోషిమాలో అణు దాడి కంటే 7 రెట్లు ఎక్కువ తీవ్రతతో సంభవించింది. 32 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. భూకంపం వల్ల కలిగే నష్టం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది జనాభా సాంధ్రత కాగా రెండోది భూకంపం కేంద్రం ఎంత లోతుగా ఉందనేది.


టర్కీ భౌగోళిక పరిస్థితి ఏమిటి?


టర్కీ దాని భౌగోళికస్థితి కారణంగా ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప మండలాలలో ఇదొకటి. టర్కీ ప్రధానంగా అనటోలియన్ టెక్టోనిక్ ప్లేట్‌లో ఉంది. నిజానికి భూమి పెద్ద టెక్టోనిక్ ప్లేట్లపై ఉంది. ఈ ప్లేట్లు తరచుగా ఒకదానితో ఒకటి ఢీ కొంటాయి. అధిక పీడనం కారణంగా చాలా సార్లు ఈ ప్లేట్లు విరిగిపోతాయి. ఈ సమయంలో భారీ శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి రాతి పొరలను దాటుకొని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో వీక్‌గా ఉన్న ఏరియాపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని వల్ల భూమి కంపించి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. 


ఆఫ్రికన్- అరేబియన్ ప్లేట్లు..


టర్కీలో ఎక్కువ భాగం అనటోలియన్ టెక్టోనిక్ ప్లేట్‌లో ఉంది. ఈ ప్లేట్ యురేషియన్, ఆఫ్రికన్, అరేబియన్ ప్లేట్ల మధ్య ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం, ఆఫ్రికన్, అరేబియా ప్లేట్లు మారినప్పుడు టర్కీకి ఇబ్బందులు తలెత్తుతాయి. భూమి లోపల చాలా పెద్ద మొత్తంలో విడుదలైన శక్తి టర్కీపై తీవ్ర ప్రభావం చూపింది. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం... టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు, అణు బాంబులకు సమానమైన శక్తి విడుదల అవుతుంది. ఫలితంగానే పెద్ద వినాశనం జరుగుతుంది. ఇప్పుడు టర్కీ భూ పొరల్లో అదే జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.