Turkey Syria Earthquake: సోమవారం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటి వరకు 4500 మందికిపైగా ప్రజలు మరణించగా.. 14 వేల మందికిపైగా గాయపడ్డారు. అయితే ఇంతటి విపత్తును పరిశోధకులు ముందుగానే అంచనా వేయలేదా అని చాలా మందికి అనుమానం కల్గి ట్విట్టర్ లో వెతకగా.. ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. భూకంపం రావడానికి మూడ్రోజుల ముందే భారీ భూకంపం రాబోతున్నట్లు ప్రకటించిన ఓ ట్వీట్ కనిపించింది.
భూకంపాలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్ బీట్స్ మూడు రోజుల ముందుగానే ట్విట్టర్‌లో ఈ రోజు కాకపోతే రేపు తీవ్ర భూకంపం వస్తుందని చెప్పారు. దక్షిణ మధ్య టర్కీ (టర్కీ), జోర్డాన్, సిరియా లెబనాన్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వస్తుందంటూ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన ఈ ట్వీట్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అంతేకాదండోయ్ విపరీతంగా ఎగతాళి కూడా చేశారు. మీరు చెప్పేవన్నీ అవాస్తవాలే అంటూ కామెంట్లు చేశారు. మీరు గతంలో ప్రకటించిన ఏ ఒక్క అంచనా కూడా నిజం కాలేదంటూ వెక్కిరించారు.
రెండో రోజు కూడా ప్రజలను అప్రమత్తం చేసిన ఫ్రాంక్ హూగర్ బీట్స్
ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సోమవారం భూకంపం సంభవించిన తర్వాత ఫ్రాంక్ హూగర్ బీట్స్ తన పరిశోధనా సంస్థ ఎస్ఎస్జీఈఓఎస్ చేసిన పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ఇందులో మరోసారి భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఈ ట్వీట్ చేసిన మూడు గంటల తర్వాత టర్కీలో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. అటువంటి పరిస్థితిలో హూగర్ బీట్స్ రెండో అంచనా కూడా నిజమని నిరూపితమైంది.
ప్రమాదం తర్వాత సంతాపం వ్యక్తం చేసిన హూగర్ బీట్స్
భారీ భూకంపం వచ్చి వేలాది మంది మృతి చెందడం, వందలాది భవనాలు పేక మేడల్లా కూలిపోవడం చూసిన హూగర్ బీట్స్.. ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. “సెంట్రల్ టర్కీలో సంభవించిన భారీ భూకంపం వల్ల ప్రభావితమైన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. 115, 526 సంవత్సరాల తరహాలోనే ఈ ప్రాంతంలో కూడా భూకంపం వస్తుందని ముందే చెప్పాను. "
గేళీ చేసిన నెటిజెన్లు..!
మూడు రోజుల క్రితం భూకంపం వస్తుందని హూగర్ బీట్స్ ట్వీట్ చేసినప్పుడు నెటిజెన్లు ఆయనను ఎగతాళి చేసారు. కొంతమంది అతని అంచనాల గురించి కూడా తీవ్ర విమర్శలు చేశారు. హూగర్ బీట్స్ లెక్కల ఆధారంగా భూకంపాలను అంచనాలు వేస్తున్నారని.. చాలా వరకు అవన్నీ తప్పుడు అంచనాలే అని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. "భూకంప శాస్త్రవేత్తలు తమ పనిని తప్పు దారి పట్టించే, తప్పుడు అంచనాలు చేయడం, భూకంపాలను అంచనా వేయడానికి కచ్చితమైన మార్గం కూడా వారి దగ్గర లేదంటూ" మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు.