Turkey Earthquake: టర్కీ-సిరియాలో వినాశకర భూకంపం వల్ల మృతుల సంఖ్య 4365కు చేరుకుంది. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం (ఫిబ్రవరి 6) టర్కీ, పొరుగున ఉన్న సిరియాలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం కారణంగా పెద్ద మొత్తం ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. వందల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. తాజా గణాంకాల ప్రకారం.. భూకంపం తరువాత టర్కీ, సిరియాలో 4365 మందికిపైగా మరణించారు. 14000 మందికిపైగా గాయపడ్డారు. కహ్రామన్మరాస్‌లోని ఎల్బిస్తాన్ జిల్లాలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. లెబనాన్, సిరియాతో సహా అనేక పొరుగు దేశాలలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి.
కూలిపోయిన 5,606 భవనాలు..
భూకంపం కారణంగా 5,606 భవనాలు కూలిపోయాయని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) రిస్క్ రిడక్షన్ జనరల్ మేనేజర్ ఓర్హాన్ టాటర్ తెలిపారు. శిథిలాల నుంచి 6,800 మందిని బయటకు తీసుకొచ్చినట్లు టాటర్ చెప్పారు.
9700 మంది రెస్క్యూ సిబ్బంది..
దాదాపు 9700 మంది రెస్క్యూ సిబ్బంది ఈ ప్రాంతంలో పని చేస్తున్నారని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) తెలిపింది. విపత్తు ప్రాంతాల్లో తగిన సంఖ్యలో బృందాలు పని చేస్తున్నాయని, గాయపడిన వారిని గుర్తించడంతోపాటు వారిని రక్షించి ఆరోగ్య సేవలు అందించే ప్రక్రియ కొనసాగుతున్నాయని టర్కీ ఆరోగ్య మంత్రి కోకా తెలిపారు. భూకంపం దక్షిణ ప్రావిన్స్‌లపై ఎఫెక్ట్ చూపిందని అక్కడ చనిపోయిన వారి కోసం టర్కీ ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటిస్తుందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపాల కారణంగా ఏడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించామని, ఫిబ్రవరి 12 ఆదివారం సూర్యాస్తమయం వరకు జెండా అవతనం అంటే సగం మేర ఎగరేసి ఉంటుందని ఎర్డోగాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
టర్కీకి భారత్ సాయం
ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. పీఎమ్ఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ రెండు ఎండీఆర్ఎఫ్ బృందాలను టర్కీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రెండు బృందాలు టర్కీకి బయలు దేరాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ-17 టర్కీకి బయలుదేరింది. ఈ విమానం ఇతర భారతీయ సంస్థలతో పాటు ఐఏఎఫ్ చే నిర్వహించబడే పెద్ద సహాయక చర్యలో భాగం.
స్పెయిన్, ఇజ్రాయెల్, అమెరికాల ఆపన్నహస్తం..
భూకంప బాధిత సిరియా ప్రజలను ఆదుకునేందుకు స్పెయిన్ ముందుకొచ్చింది. శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్ లను పంపించారు. ఇజ్రాయెల్ కూడా టర్కీకి ఆపన్న హస్తం అందించింది. రెస్క్యూ టీమ్ టర్కీకి బయలుదేరింది. టర్కీ-సిరియాలో వినాశకరమైన భూకంపం గురించి పీఎమ్ఓలో ఓ సమావేశం జరిగింది. ఆ తర్వాత ప్రధాని మోదీ సూచనల మేరకు రెండు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు టర్కీకి బయలుదేరాయి.
ఇప్పటి వరకు మొత్తం 46 సార్లు ప్రకంపనలు
టర్కీలో సోమవారం ఉదయం నుంచి భూకంప ప్రకంపనలు నిరంతరంగా వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 46 సార్లు ప్రకంపనలు వచ్చాయి. భూకంప ప్రకంపనల తీవ్రత 4.3 నుంచి 7.8గా నమోదు అయింది. సోమవారం సంభవించిన భూకంపం కారణంగా టర్కీలో అత్యధిక విధ్వంసం జరిగింది. ఇక్కడ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది.