సంక్రాంతి అనంతరం తగ్గుముఖం పట్టిన చలి, తెలంగాణలో తాజాగా పెరిగింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. నేడు మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేశారు.


కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మొన్న (ఫిబ్రవరి 5) ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.


ఎల్లో అలర్ట్ ఈ 13 జిల్లాల్లో


ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, ములుగు, జగిత్యాల, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.


ఖమ్మంలో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 33.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది.  ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంటుందని... అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేసింది.


ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ శాఖ ఆదివారం (ఫిబ్రవరి 6) రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. కొమొరిన్ ప్రాంతం, పరిసరాల్లో సగటు సముద్ర మట్టం కంటే 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడిందని వివరించింది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని పేర్కొంది. 


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.


ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితి నుంచి ఆ ప్రాంతాలు తేరుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి గణనీయంగా తగ్గింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమపాతాలు, లోతట్టు మైదానాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఉదయం, సాయంత్రం పొగమంచు కనిపిస్తోంది.