నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా తనకు ప్రాణహాని ఉందని వైసీపీ కార్పొరేటర్ విజయ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ మీద అభిమానంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీలు తీసేశానని తనను ఆ వర్గానికి చెందిన వారు బెదిరించారని, కిడ్నాప్ కూడా చేయబోయారని చెప్పారు. తనని పరామర్శిస్తున్నట్టుగా కొంతమంది ఫోన్లు చేస్తున్నారని, తనపై అటాక్ జరిగినట్టు ప్రచారం జరుగుతోందని, తనని మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టిన కార్పొరేటర్ విజయ భాస్కర్ రెడ్డి.. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాణమైనా వదిలేస్తా కానీ వైసీపీ నుంచి బయటకు వెళ్లను అని అన్నారాయన.


వేడెక్కుతున్న నెల్లూరు రాజకీయాలు 
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యే వైపు, మరికొందరు పార్టీ వైపు ఉన్నారు. రూరల్ పరిధిలోకి వచ్చే 26 మంది కార్పొరేటర్లలో ఒకరిద్దరు మినహా మిగతా అందరూ ఎమ్మెల్యేవైపే ఉంటారని అనుకున్నారు. కానీ రోజులు గడిచేకొద్దీ కార్పొరేటర్లలో మార్పు మొదలైంది. ఒక్కొక్కరే ఆయన నుంచి చేజారిపోతున్నారు. వారిలో విజయ భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే విజయ భాస్కర్ రెడ్డి, మొదట్లో తన వద్దకే వచ్చారని, ఆ తర్వాత ఎవరి ప్రోద్బలంతోనో ఆయన పార్టీలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారని ఇటీవల కోటంరెడ్డి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. తనపై తప్పుడు కిడ్నాప్ కేసు పెట్టారని అవసరమైతే హత్యాయత్నం కూడా యాడ్ చేసుకోవాలన్నారు. ఆ తర్వాత కోటంరెడ్డి తాను ఇక విజయ భాస్కర్ రెడ్డితో మాట్లాడనన్నారు.


సడన్ గా మళ్లీ తెరపైకి విజయ భాస్కర్ రెడ్డి..


కోటంరెడ్డి తనను పట్టించుకోను అన చెప్పినా కూడా ఆయన తరపున కొంతమంది తమను బెదిరిస్తున్నారని విజయ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తనకు ఫోన్లు చేసి, తనను పరామర్శించినట్టుగానే మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి తనకు హాని జరుగుతుందో చెప్పలేనన్నారు. ఈ క్రమంలో తనకు ప్రాణ హాని ఉందని కూడా ఆరోపిస్తున్నారు కార్పొరేటర్ విజయ భాస్కర్ రెడ్డి.


నెల్లూరు రూరల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. విజయ భాస్కర్ రెడ్డి ఎపిసోడ్ కాస్త ముందుగా మొదలైనా.. చాలామంది కోటంరెడ్డికి నమ్మిన బంట్లుగా ఉన్న కార్పొరేటర్లు కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉంటామని చెప్పారు. తాజాగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకి రాగా, ఆయనకు స్వాగతం చెప్పేందుకు చాలామంది కార్పొరేటర్లు వచ్చారు. వారంతా తాము జగన్ తోనే ఉంటామని, పార్టీలోనే ఉంటామని చెప్పారు. ఇకపై ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంటే తాము కూడా నడుస్తామన్నారు. కోటంరెడ్డితో వెళ్లే ప్రసక్తే లేదన్నారు.


ఎమ్మెల్యే కోటంరెడ్డి మాత్రం, కొంతమంది కార్పొరేటర్లు కాంట్రాక్ట్ బిల్లుల సమస్య వల్ల తనతో కలసి నడవలేనని చెప్పారని, అలాంటి వారంతా ఎన్నికల సమయంలో తనతోటే వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తానెప్పుడూ నేతల్ని బెదిరించనని, అభిమానంతోనే వారంతా తన దగ్గరకు వస్తారన్నారు కోటంరెడ్డి. అయితే కార్పొరేటర్ విజయ భాస్కర్ రెడ్డి మాత్రం కోటంరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని చెప్పడం, ఆయనపై కేసు పెట్టడం మాత్రం సంచలనంగా మారింది.