Trump Attacks Biden: 


తీవ్ర ఆరోపణలు..


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌...బైడెన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. "జో బైడెన్ పెద్ద అవినీతి పరుడు" అంటూ విమర్శించారు. అమెరికా చరిత్రలోనే అధ్యక్షుడి పదవిని ఇంతలా దుర్వినియోగపరుస్తున్న నేత ఇంకెవరూ లేరని మండి పడ్డారు. సీక్రెట్ డాక్యుమెంట్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్...ఇలాంటి కామెంట్స్ చేయడం కీలకంగా మారింది. తనపై కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపోరాటం కూడా మొదలు పెట్టారు. మియామిలోని ఫెడరల్ కోర్టులో తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. వచ్చే ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ రేసులో తాను కూడా ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు ట్రంప్. ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్న ట్రంప్‌ని చిక్కులు వెంటాడుతున్నాయి. వరసగా ఏదో ఓ కేసులో ఇరుక్కుంటున్నారు. 


"అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. అమెరికా చరిత్రకే ఇది కళంకం తెచ్చి పెట్టింది. ఎంతో బాధగా ఉంది. అవినీతి పరుడైన వ్యక్తి (బైడెన్‌ని ఉద్దేశిస్తూ) అధ్యక్ష పదవిలో ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థినైన నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఓడిపోతాననే భయం పట్టుకుంది. అందుకే ఇలా నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇంత కన్నా దారుణంగా ఇంకేదీ ఉండదు"


-డొనాల్ట్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు


ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ న్యాయపోరాటం చేయగా...విదేశీ పర్యటనలపై ఉన్న ఆంక్షలు తొలగించింది ఫెడరల్ కోర్టు. అయితే...ఈ కేసుల్లో సాక్షులుగా ఉన్న వారితో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండకూడదని తేల్చి చెప్పింది. ఈ వ్యాఖ్యలు చేయగానే...కోర్టులోని ట్రంప్ మద్దతుదారులంతా "We Love Trump" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. 


ఇదీ కేసు..


డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్స్‌ని ట్రంప్ తన వద్దే అనధికారికంగా వాటిని దాచి పెట్టుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే ఆయనపై కేసు నమోదైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తరవాత వైట్‌హౌజ్‌ని ఖాళీ చేసి వెళ్లే సమయంలో కొన్ని కీలక పత్రాలను ట్రంప్ తనతో పాటు తీసుకెళ్లాడన్నది ప్రధాన ఆరోపణ. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో (Mar-a-Lago)రిసార్ట్‌లో వాటిని దాచి పెట్టినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఇదే విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. తనపై కేసులు పెట్టినట్టు చెప్పారు. అధికారులు ఇప్పటికే ఆయన రిసార్ట్‌లో సోదాలు నిర్వహించారు. కొన్ని కీలక పత్రాలు దొరికాయి. వాటిని వైట్‌హౌజ్‌కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ట్రంప్ అడ్డుకున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే...ట్రంప్ మాత్రం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. మియామి ఫెడరల్‌ కోర్టులో హాజరు కావాలని తనకు సమన్లు జారీ చేశారని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడిపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని ట్రంప్ తన Truth Social సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 


Also Read: Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, 9 మంది మృతి - కొందరికి తీవ్ర గాయాలు