Manipur Violence:
9 మంది మృతి..
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా...అది సాధ్యం కావడం లేదు. గత 24 గంటల్లో జరిగిన అల్లర్లలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. ఖమేన్‌లోక్ ఏరియాలో అర్ధరాత్రి పూట ఉన్నట్టుండి ఫైరింగ్ జరిగింది. 9 మంది అక్కడికక్కడే చనిపోగా...కొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారి శరీరాలపై లోతైన గాయాలున్నట్టు వైద్యులు వెల్లడించారు. బులెట్ గాయాలు కూడా ఉన్నట్టు తెలిపారు. దాదాపు నెల రోజులుగా గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ ఘటనతో మరోసారి కర్ఫ్యూ విధించారు పోలీసులు. పలు చోట్ల కఠిన ఆంక్షలు విధించారు. ఇంఫాల్, కంగ్‌పోక్పి సరిహద్దులోని ఖమేన్‌లోక్‌లో హింస చెలరేగుతోంది. దాదాపు రెండు రోజులుగా ఇక్కడి వాతావరణం వేడిగానే ఉంది. ఇప్పటి వరకూ మణిపూర్‌లోని హింసాత్మక ఘటనల కారణంగా దాదాపు 100 మంది చనిపోయినట్టు అంచనా.