Baloch Liberation Army : భారత్‌తో జరిగిన ఘర్షణలో పాకిస్థాన్ సైనిక పటిమ ఎంతో ప్రపంచానికి అర్థమైపోయింది. బయటకు చెప్పుకునేంత శక్తి లేదని అంతా ఢాంబికాలేనని స్పష్టమైంది. ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉంది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆ సంస్థ దాడులు చేస్తోంది. పాకిస్థాన్ సైన్యాన్ని పరుగెత్తిస్తోంది.
భారీ విధ్వంసం ఎదురైనప్పటికీ ఆ దేశ ప్రజలను మభ్య పెట్టడానికి భారత్‌పై విజయం సాధించామని సంబరాలు చేసుకుంది పాకిస్థాన్. ఈ సంబరాలను క్వెట్టాలో కూడా చేపట్టింది. అక్కడ బలంగా ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ దీన్ని వ్యతిరేకించింది. దీంతో బిఎల్ఏకు పాక్ సైన్యానికి మధ్య ఘర్షణ జరిగింది. పాకిస్తాన్ సైన్యం రక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది ఎమ్మెల్యే అలీ మదద్ జట్టక్. కార్యక్రమం ప్రారంభానికి ముందు మునీర్ మెంగల్ రోడ్డుపై గ్రెనేడ్ దాడి జరిగింది, దీనిలో ఒక సైనికుడు మరణించగా 12 మంది గాయపడ్డారు.
బీఎల్‌ఏకు స్థానికుల నుంచి భారీ మద్దతు
ఈ దాడి కేవలం భద్రతా లోపం మాత్రమే కాదు, బలూచ్ ఉద్యమం ప్రతీకారానికి నిదర్శనంగా చెబుతున్నారు. బలూచ్‌స్తాన్‌పై ఆక్రమణ కొనసాగుతున్నంత వరకు ఇలాంటి దాడులు తప్పవని బిఎల్ఏ స్పష్టం చేసింది. అంతేకాకుండా, మస్తుంగ్‌లోని ఎంసీసీ క్రాస్‌లో ఉన్న పాకిస్తాన్ సైన్యం బంకర్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ దాడిలో 4 మంది పాకిస్తాన్ సైనికులు గాయపడ్డారు. ఈ బంకర్ బలూచ్ ప్రజలకు అణచివేత కేంద్రంగా మారింది.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలూచ్ ఏమన్నారంటే?
బిఎల్ఏ ఈ దాడిని ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ, బలూచ్ ప్రజల గౌరవం, భద్రతతో చెలగాటం ఇక సహించబోమని స్పష్టం చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలూచ్ విడుదల చేసిన ప్రకటనలో, బలూచ్‌స్తాన్‌లో ఎక్కడా పాకిస్తాన్ సైన్యానికి భద్రత లేదని ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు. బలూచ్ ప్రజల మద్దతు నిరంతరం బలాన్ని ఇస్తోంది. బలూచ్ ఉద్యమం వేర్పాటువాదం మాత్రమే కాదని, ప్రజా మద్దతుతో నడిచే ఉద్యమంగా మారింది' అని పాకిస్తాన్ ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేసింది.
వాస్తవాన్ని వదిలేసి విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపిస్తున్న పాకిస్థాన్
బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని, పాకిస్తాన్ పాలనకు ఇది హెచ్చరిక అని వార్నింగ్ ఇచ్చింది. బలూచీస్తాన్‌లో భయోత్పాతం, నియంత్రణ విధానం ఇక పనిచేయదని ఇది స్పష్టం చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దాడులను ఉగ్రవాద ఘటనలుగా అభివర్ణిస్తూ క్వెట్టాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. రోడ్డు మూసివేతల ద్వారా నగరాన్ని గుప్పెట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది, కానీ స్థానికులు దీని వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారారని అంటున్నారు. బలూచ్ ఉద్యమానికి 'విదేశీ శక్తుల' మద్దతు ఉందని ప్రభుత్వ ప్రకటనల్లో పాకిస్థాన్ చెబుతోంది. కానీ వాస్తవికత ఏమిటంటే ఈ ఉద్యమం మూలాలు స్థానిక బాధలు, అణచివేతలో ఉన్నాయి.