Demand For Brahmos missile : ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత బ్రహ్మస్త్రంగా మారిన బ్రహ్మోస్ క్షిపణి కోసం పలు దేశాలు ఎదురు చూస్తున్నాయి. కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బ్రహ్మోస్ క్షిపణిని భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. అత్యంత వేగం , ఖచ్చితత్వం, సముద్రం, భూ, గాలి నుంచి ప్రయోగించగల సామర్థ్యం కారణంగా అంతర్జాతీయంగా బ్రహ్మాస్త్రంగా మారింది. ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం ఈ క్షిపణిని విజయవంతంగా ఉపయోగించడంతో పనితీరును ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయి.
పలు దేశాలు ఈ బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 2022లో ఫిలిప్పీన్స్ 375 మిలియన్ డాలర్ల ఒప్పందంతో బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆక్రమణకు వ్యతిరేకంగా ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్ వ్యూహాత్మకంగా మోహరించింది. వియత్నాం కూడా $700 మిలియన్ డాలర్ల ఒప్పందంతో బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టెక్నో-కమర్షియల్ చర్చలు పూర్తయ్యాయి, త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇండోనేషియా కూడా 450 మిలియన్ డాలర్ల విలువైన 290 కి.మీ. రేంజ్ బ్రహ్మోస్ క్షిపణుల ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. 2020 జులైలో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబోవో సుబియాంటో భారత్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాలు బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి. *బ్రూనై, చిలీ, మలేషియా, ఒమన్, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి దేశాలు కూడా నావల్ , కోస్టల్ డిఫెన్స్ వెర్షన్‌లపై ఆసక్తి చూపుతున్నాయి. మలేషియా తన కెడా-క్లాస్ యుద్ధనౌకలు , సుఖోయ్ Su-30MKM ఫైటర్ జెట్‌ల కోసం ఈ క్షిపణులను పరిశీలిస్తోంది.
బ్రెజిల్ సైన్యం కమాండర్ జనరల్ టోమస్ రిబెరో పైవా 2023లో భారత్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగిన సైనిక విన్యాసాలను సందర్శించి, సముద్ర వెర్షన్, షోర్-బేస్డ్ యాంటీ-షిప్ క్షిపణులపై చర్చలు జరిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ ఆపరేషన్ బ్రహ్మోస్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది, దీనితో 17 దేశాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దక్షిణ చైనా సముద్రంలో చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఎక్కువ దేశాలు బ్రహ్మోస్ ను నమ్ముకుంటున్నాయి. భారత్ 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. బ్రహ్మోస్ ఈ లక్ష్యంలో కీలక పాత్ర పోషిస్తోంది.