Pakistan begging for water written a letter to India: సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని మళ్లీ సమీక్షించి.. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ ను వేడుకుంది. ఈ మేరకు లేఖను భారత ప్రభుత్వానికి పంపింది. తాము తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని.. పాకిస్తాన్ చెప్పింది.
పెహల్గాంలో తీవ్రవాదులు భారతీయ పర్యాటకుల్ని కాల్చి చంపిన తర్వాత పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలను తెంపుకోవాలని భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగా సింధూనది పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి ప్రపంచ బ్యాంకుకే అధికారం ఉంది. ప్రపంచ బ్యాంకు కూడా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో పాకిస్తాన్ కు నీళ్లు ఆగిపోయాయి. అప్పట్నుంచి పాకిస్తాన్ తీవ్ర సమస్యల్లో ఉంది. సింధూ జలాల వల్లనే సగం పాకిస్తాన్ నీళ్లు తాగుతోంది. వ్యవసాయం చేసుకుంటోంది. ఆ నీటిని ఆపేస్తే.. వ్యవసాయం కూడా సాగే అవకాశం ఉండదు. ఈ పరిస్థితి అప్పుడే కనిపిస్తూండటంతో.. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
పాకిస్తాన్ రాసిన లేఖలో ఏముందో ఇంకా స్పష్టత లేదు. అియతే 1969 వియన్నా కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ ట్రీటీస్ (VCLT) ప్రస్తావన చేసినట్లుగా తెలుస్తోంది. తమ హక్కులను కాలరాశారని చెప్పడంతో పాటు పడుతున్న కష్టాలను కూడా చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. పెహల్గాం దాడుల తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అనూహ్యంగా కాల్పుల విరమణ ప్రకటంచారు. భారత్, పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరిగాయి. సీజ్‌ఫైర్ అమలులోకి వచ్చింది. అయినప్పటికీ, సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ కొనసాగుతుందని ఇీటీవల భారత ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్తాన్ సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాయబార నోటీసు లేదా లేఖ పంపేందుకు సిద్ధమవుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. భారత్ ఇండస్ ట్రీటిని క్యాన్సిల్ చేసి..నీళ్లను ఆపేసింది. ఈ కారణంగా సింధూ నదిపై డ్యాములన్నీ నిండిపోయాయి. వాటిని నిల్వ చేసుకోవడానికి అవసరమైనంత మౌలిక సదుపాయాలు లేవు. ఈ కారణంగా కిందకు నీరు పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కు వరదలు వచ్చేలా గతంలో ఒక్క సారే రిలీజ్ చేసింది. ఈ సారి అలాంటి ప్రయత్నం చేస్తుందా.. పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి కాబట్టి మానవతా దృక్పథంతో నీటిని వడుదల చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.